ఇండియాలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 ఢిల్లీ వేదికగా నిర్వహించిన `వాట్ ఇండియా థింక్స్ టుడే` సమ్మిట్‌లో పీఎం నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మై హోమ్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు మోదీకి స్వాగతం పలికారు. ఈ శిఖరాగ్ర సదస్సులో మోదీ దేశాన్ని సూపర్ పవర్‌గా నిలబెట్టేందుకు ఉన్న ఆవకాశాలను వివరించారు.పేదరికం నుంచి పరుల సేవ దాకా, సమకాలీన రాజకీయాల నుంచి జాతీయ అంతర్జాతీయ అంశాల దాక అన్ని విషయాలపై తన మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తపరిచారు.
నేడు ప్రపంచ దృష్టంతా భారత్‌పైన ఉందన్నారు. భారతదేశ ఆలోచనల గురించి యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఇండియా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో పోల్చి చూపారు. గత 11 ఏళ్లలో భారతదేశం సాధించిన పురోగతిని వివరించారు. అలాగే వాట్ ఇండియా థింక్స్ టుడే ఒక వినూత్నమైన కార్యక్రమం అని అన్నారు. ఆలోచనల మహాకుంభమేళాగా అభివర్ణించే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీవీ9పై మోదీ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. మరిన్ని మీడియా సంస్థలకు కూడా ఎంతో ప్రేరణ ఇచ్చే విధంగా ఉందని మోదీ పేర్కొన్నారు.
వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన భారతదేశ ఆర్థిక పురోగతి ప్రయత్నాల గురించి వివరించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ డేటా ప్రకారం.. రాబోయే రెండేళ్లలో ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని రాము రావు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో భారత్ వైపు ప్రపంచమంతా చూస్తుందన్నారు.
మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు. పీఎం గతి శక్తి, స్టార్టప్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక చేరిక వంటి రంగాల్లో మార్పునకు దారితీస్తుయని.. డిజిటల్ ఇండియా చొరవ అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఒక ఆదర్శంగా మారుతోందని రాము రావు చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక రంగంలో తన స్థానాన్ని దృఢంగా మార్చుకుందన్నారు. 1.45 బిలియన్ల భారతీయుల ఆకాంక్షలకు బలమైన దిశానిర్దేశం చేయడం, ప్రపంచ వృద్ధికి భారతదేశం ప్రధానంగా మారడం ద్వారా తాను ఎంతో ప్రేరణ పొందానని రాము రావు పేర్కొన్నారు.