“దేశంలో ఇంత జరుగుతున్నా.. ప్రధాని నరేంద్ర మోడీలో చలనం లేదు. ఆయన ఏమాత్రం పశ్చాత్తాపపడ డం లేదు“ ఇదీ.. రెండు రోజులుగా దేశ ప్రజలు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు. మరికొందరు.. “ఇ న్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించి.. తన పదవికి రిజైన్ చేయాలి“ అని డిమాండ్లు చేస్తున్నారు.
ముఖ్యంగా ట్వీట్టర్లో ఈ వ్యాఖ్యలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినప్ప టికీ.. మోడీ మాత్రం చీకూ చింతా లేకుండా వ్యవహరిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత భారీగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికి 15 కోట్ల మంది పైచిలుకు యాక్టివ్ పేషెంట్లుగా ఉన్నారు. ఇంకా పాజిటివ్ కేసులు పెరుగుతాయని తెలుస్తోంది. ఇక, ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్నవారికి ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో చనిపోతున్నారు.
అదేసమయంలో ఆక్సిజన్ లీకై.. రెండు రోజుల కిందట నాసిక్‌లో 24 మంది ఐసీపీయూలోని రోగులు మృత్యువాత పడ్డారు. అదేవిధంగా మహారాష్ట్రలోనే ఓ ఆసుపత్రిలో ఏసీ పేలిపోయి.. 15 మంది కరోనా రోగులు సజీవ దహనం అయ్యారు.
ఇక, కరోనాతో మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ప్రజల్లో కరోనా భయం దడ పుట్టిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నా.. ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందనే వాదన వస్తోంది. ఇక, గత ఏడాది నుంచి ఇప్పటి వరకు లక్షా 89 వేల 544 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే.. 2624 మంది మృతి చెందారు.
మరి ఇంత జరిగితే.. దేశాధినేతకు ఏమీ బాధ్యతలేదా? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు, వైద్యం అందించలేని నేతలు పాలకులుగా ఉండాలా? అనేది ప్రజల నుంచి వస్తున్న సూటి ప్రశ్న. ఇలాంటి వారు మనకు పాలకులు అని చెప్పుకొనేందుకు సిగ్గుగా ఉంది! అని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీని రిజైన్ చేయాలనే డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక, ప్రజల పట్ల, ప్రజల ప్రాణాల పట్ల నేతలు ఎంత బాధ్యతగా వ్యవహరించాలో.. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి చేసి చూపించిన విషయాన్ని తెరమీదికి తెచ్చి.. మోడీని గట్టిగా హెచ్చరిస్తుండడం గమనార్హం.
1956లో నెహ్రూ కేబినెట్లో లాల్ బహదూర్ శాస్త్రి.. రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే.. అదే ఏడాది ఆగస్టులో ప్రస్తుత తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో 112 మంది ప్రయాణికులు చనిపోయారు. దీంతో చలించిపోయిన..శాస్త్రిగారు.. పరోక్షంగా ఇంతమంది ప్రాణాలు పోవడానికి తాను బాధ్యుడినని.. రైల్వేలను ప్రమాదాల నుంచి కాపాడలేక పోతున్నానని పేర్కొంటూ.. నిముషాల వ్యవధిలో తన పదవికి రిజైన్ చేశారు. అయితే.. నెహ్రూ దానిని యాక్సెప్ట్ చేయలేదు. దీంతో శాస్త్రిగారు బలవంతంగానే కొనసాగారు. రైల్వేలను ప్రమాదాల నుంచి బయట పడేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టారు.
అయితే.. ఇంతలోనే అదే ఏడాది నవంబరులో తమిళనాడులోని అరియలూరులో మరో రైలు ప్రమాదం సంభవించి 144 మంది ప్రయాణికులు చనిపోయారు. దీంతో ఇక, ఒక్కనిముషం కూడా తనకు రైల్వే శాఖ మంత్రి సీట్లో కూర్చొనే అర్హత లేదని పేర్కొంటూ.. రెండోసారి రాజీనామా సమర్పించారు. ఇక, విధిలేని పరిస్థితిలో దానిని అంగీకరిస్తున్నానంటూ.. అప్పటి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యానించారు.
అంటే.. మొత్తంగా ఈ రెండు ప్రమాదాల్లోనూ చనిపోయిన వారి సంఖ్య 256. దీనికే శాస్త్రిగారు నిబద్ధతతో వ్యవహరించి.. తన పదవిని వదులుకున్నారు. కానీ.. ఇప్పుడు కేవలం 12 నెలల కాలంలో దేశంలో కరోనా కారణంగా.. కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో ప్రజలను నడిపించని కారణంగా.. సరైన వైద్యం అందించని కారణంగా.. సరైన ముందు చూపు లేని కారణంగా.. లక్షా 89 వేల 544 మంది చనిపోయారు. ఇది అధికారిక లెక్క. ఇది కాకుండా మరింత మంది మృతి చెంది ఉంటారని నిపుణులు అంటున్నారు.
మరి దీనికి కనీసం.. మోడీ బాధ్యత వహించరా? తెల్లారిలేస్తే.. శాస్త్రి గారు ప్రవచించిన జైజవాన్-జైకిసాన్ అంటారే.. ఆయనకు దండేసి దణ్నాలు పెడతారే.. మరి ఆయన అనుసరించిన మార్గాన్ని మాత్రం ఆదర్శంగా తీసుకోరా?! అనేది ప్రజల ఘోష!! ఇప్పటికైనా ఏమాత్రం శాస్త్రిగారిపై గౌరవం ఉన్నా.. మోడీ తనపదవికి రిజైన్ చేయాలని కోరుతున్నారు నెటిజన్లు!!