విశాఖ లో తాజాగా నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభ సక్సెస్ అయింది. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే.. ఈ సభ ఆసాంతం ఒకరిపైఒకరు ప్రశంసల జల్లు కురిపించుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అదేసమ యంలో పెద్ద ఎత్తున హామీలకు కూడా.. అవకాశం ఇచ్చారు. ఇక, ఈ సభ సక్సెస్ ద్వారా.. ప్రధాని మోడీ, సీఎం బాబులు సరికొత్త రికార్డును సృష్టించారనే చెబుతున్నారు.
గతంలోనూ ఇలాంటి సభలు నిర్వహించినా.. తాజాగా విశాఖ సభ వేదికగా వారు ఒకరిపై ఒకరు పొగడ్తల జల్లు కురిపించుకున్నారు. ప్రధానంగా అమరావతి విషయంలో తొలిసారి చంద్రబాబు స్పందించారు. రాజధాని నిర్మాణానికి ఇతోధిక సాయం చేయాలని ఆయన అభ్యర్థించారు. 2018లో వివాదం చోటు చేసుకు న్న తర్వాత.. చంద్రబాబు అమరావతి విషయాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించలేదు. ఇప్పుడు ఈ విషయా న్ని ప్రధానంగా చేసుకుని ఆయన సొమ్ములు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే మోడీని ఈ విషయంపై సభా వేదిక నుంచే అభ్యర్థించడం గమనార్హం. ఇక, ప్రాజెక్టులు, విజన్లు వంటి విషయాల్లో మోడీ.. చంద్రబాబును, చంద్రబాబు మోడీని పరస్పరం ప్రశంసించుకున్నా రు. మొత్తంగా చంద్రబాబు సూపర్ సిక్స్ కొట్టారని మోడీ అంటే.. మోడీ లాంటి నాయకుడితో తమ బంధం మరింత బలోపేతం అవుతుందని చంద్రబాబు పదే పదే చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ సంగతి సరేసరి! మొత్తంగా.. విశాఖ సభ ద్వారా.. రాజకీయ వ్యూహాన్ని కూడా చాలా చక్కగానే ఆవిష్కరించినట్టు అయింది.
కానీ..
అయితే.. సీఎం చంద్రబాబు, పీఎం మోడీల వ్యూహాత్మక ఈ సభ వ్యవహారం.. వారి స్ట్రాటజీ వంటివి తిరుప తి తొక్కిసలాట ఘటనతో దాదాపు చర్చకు లేకుండా పోయిందనే చెప్పాలి. తిరుపతిలో చోటు చేసుకున్న ఘటనతో ఈ సభా వ్యవహారంపై ఫోకస్ మరుక్షణంలోనే ప్రజల మది నుంచి తప్పిపోయింది. దీంతో సభ సక్సెస్ అయినా.. రాజకీయ వ్యూహాలకు వేదికగా మారినా.. ప్రచార పర్వంలో మాత్రం కొట్టుకుపోయిందని చెప్పక తప్పదు. అయినప్పటికీ.. రాజకీయ వ్యూహాలను ఈ సభ ముందుకు తెచ్చింది. బీజేపీ-టీడీపీ బంధాన్ని.. మరింత బలోపేతం చేయడంలోనూ కృషి చేసిందనే చెప్పాలి.