చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నుంచి ఏదోలా సర్కారుకు షాకులిచ్చే అంశాల మీద జరుగుతున్న శోధనలో భాగంగా ఇటీవల విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ అంశం తెర మీదకు రావటం.. ఈ వ్యవహారంలో మిశ్రమ స్పందన వ్యక్తం కావటం తెలిసిందే. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే అంశంలో కూటమి సర్కారు మోడీ సర్కారు మాటకు ఓకే చెప్పేస్తున్నట్లుగా ఒక ప్రముఖ మీడియా సంస్థలో వచ్చిన కథనం తెలుగు తమ్ముళ్లకు మంట పుట్టేలా చేయటమే కాదు.. ఆ సంస్థ కార్యాలయం వద్ద హంగామా చేయటం తెలిసిందే.
ఈ వ్యవహారంలో విశాఖ ఉక్కును ప్రైవేటుకు కట్టబెట్టేందుకు బాబు సర్కారు సిద్ధమవుతుందన్న ప్రచారానికి విపక్షం సైతం గళం విప్పుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. కేంద్ర ఉక్కుశాఖా మంత్రి కొత్త క్లారిటీ ఇచ్చారు. ఇంతకు ఆయన ఎవరోకాదు కేంద్ర మంత్రి కుమారస్వామి. తాజాగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ప్రశ్నే లేదన్న ఆయన.. ‘‘ఈ విషయాన్ని వెల్లడించటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుమతి కావాలి. ముందు ప్రధానితో మాట్లాడి ఒప్పించాల్సి ఉంటుంది. ఈ విషయంపై మేం విస్త్రతంగా చర్చించాం. ప్లాంటును దారికి తెచ్చే సమగ్ర నివేదిక రూపొందించి ప్రధాని ముందు ఉంచుతాం. ప్రైవేటీకరణ చేస్తామని.. అమ్ముతామని ఎవరు చెప్పారు?’’ అంటూ ప్రశ్నించారు.
తాజాగా విశాఖపట్నానికి వచ్చిన ఆయన ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కూటమి నేతలతో కలిసి విశాఖ ఉక్కు ప్లాంట్ ను సందర్శించారు. విశాఖ ఉక్కు కుటుంబ సభ్యులు ఎవరూ భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ఆయన.. పరధాని మోడీ మద్దతుతో మరో నెలన్నర వ్యవధిలో ప్లాంటు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించే క్రమంలో కేంద్ర మంత్రి కుమారస్వామి బ్లాస్ట్ ఫర్నేస్ లోని విజిటర్స్ బుక్ లో రాసిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ‘‘అనేక కుటుంబాలు ఈ ప్లాంటు పై ఆధారపడి ఉన్నాయి. విశాఖ ఉక్కును పరిరక్షించటం మా బాధ్యత. ఈ ప్లాంటు మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందొద్దు’’ అని పేర్కొన్నారు.
ప్రతి ఏటా 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పిన కుమారస్వామి.. ఆ లక్ష్యాన్ని చేరుకోవటంలో విశాఖ ఉత్పత్తి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని.. పాజిటివ్ నివేదికను తయారు చేసి ప్రధానమంత్రిని ఒప్పిస్తామన్న భరోసా ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. మొత్తానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాబోతుందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్న భావన కలిగించటంలో కుమారస్వామి మాటలు కీలకంగా మారాయని మాత్రం చెప్పక తప్పదు.