రాజకీయాలు వేరు.. ప్రజల ప్రయోజనాలు వేరు. ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలి.. వ్యక్తిత్వ వికాస నిపుణుడు సైతం పాఠాలు నేర్చుకునే స్థాయిలో ప్రధాని మోడీ మాటలు ఉంటాయి. ఆయన మాటలు విన్న చాలామంది.. ఇవాల్టి రాజకీయాల్లో మోడీ లాంటి పెద్ద మనిషి ఉండటం గొప్ప విషయంగా భావిస్తారు. అయితే.. ప్రధాని మోడీ మాటలకు.. ఆయన చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదన్న విషయాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులే కాదు.. రాజకీమ విమర్శకులు తరచూ ప్రస్తావిస్తుంటారు. అందుకు తగ్గ ఉదాహరణలు వారు చూపిస్తుంటారు.
నిజంగానే మోడీ మాష్టార్ని సరిగా అర్థం చేసుకోలేని విపక్షాలు.. ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తుంటాయని అనుకుందాం. వారి వాదనలో నిజం ఉందని నమ్ముదాం. కానీ.. తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిసినప్పుడు మాత్రం.. మోడీ అలా చేయటమా? అన్న విస్మయానికి గురి కావటం ఖాయం. ప్రస్తుతం కరోనా కేసులతో యావత్ దేశం కిందామీదా పడుతోంది. ఇలాంటివేళ.. మోడీ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న విషయంలోకి వెళితే.. ఆయన పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు.
దేశం కోసం.. దేశ ప్రజల సంక్షేమం కోసం తపించే మోడీ లాంటి నేత.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెంగాల్ ఎన్నికల ప్రచారానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. ఒకపక్క వ్యాక్సిన్ కొరతతో రాష్ట్రాలు కిందా మీదా పడటమే కాదు.. కొత్తగా ఆక్సిజన్ సమస్య ఒకటి వచ్చి పడింది. రెమెడిసివర్ లొల్లి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు పలు సమస్యలతో ఉక్కిరిబిక్కరి పడుతున్న వేళలో.. మోడీ ఎన్నికల ప్రచారానికి వెళ్లటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి.
ఇదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సంచలన విషయాన్ని వెల్లడించారు. తానుప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎంతలా ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రావటం లేదని పేర్కొన్నారు. తన ఫోన్ ను ఆయన రిసీవ్ చేసుకోవటం లేదన్నారు. ఓపక్క ప్రజలు చనిపోతుంటే.. మరోవైపు ప్రధానిగా ఉన్న వ్యక్తి రాజకీయ ప్రచారాలకు ప్రాధాన్యత ఇవ్వటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.
తాను ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎంతగా ప్రయత్నించినా.. ఆయనకు ఫోన్ ఇవ్వటానికి ఆయన సిబ్బంది అంగీకరించలేదని ఫిక్కీ సమావేశంలో ఠాక్రే వెల్లడించారు.
ఒకవేళ.. ఇది తప్పుడు వాదనే అయితే.. మోడీ కాకున్నా.. ఆయన కార్యాలయం వెంటనే తప్పుపట్టేది. ఖండన పంపించేది. మోడీ మీదా.. ఆయన ప్రభుత్వం మీదా ఉద్దవ్ విమర్శలు కొనసాగిస్తూ.. రాష్ట్రంలో ఆక్సిజన్.. రెమ్ డెసివిర్ లకు విపరీతమైన కొరత ఉందని.. 20 లక్షల డోసులున్న రెమ్ డెసివిర్ ను ఎగుమతి చేసే 16 కంపెనీల్ని తాము సంప్రిస్తే.. మహారాష్ట్రకు సరఫరా వద్దని కొన్ని కంపెనీలకు మోడీ సర్కారు ఆదేశాలు ఇచ్చినట్లుగా పేర్కొని సంచలనంగా మారారు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఇలాంటి ఆరోపణ చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం మోడీ మీద ఉంది.కానీ.. ఇప్పటివరకు అలాంటిదేమీ జరగకపోవటం గమనార్హం.