ప్రపంచంలోని ప్రభావవంతమైన దేశాధ్యక్షులు, ప్రధానుల జాబితాలో భారత ప్రధాని మోడీ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. ఈ ఏడాది ట్విటర్లో అత్యంత ప్రభావవంతమైన 50 మంది జాబితాలో మోడీ రెండో స్థానంలో నిలిచారు. అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఈ లిస్ట్ లో నంబర్ 1 స్థానంలో ఉంది. వినియోగదారుల గూఢచార సంస్థ బ్రాండ్వాచ్ నిర్వహించిన వార్షిక రిసెర్చ్ ప్రకారం టేలర్ స్విఫ్ట్ నంబర్ వన్ గా నిలిచింది.
ఈ జాబితాలో ఇండియన్ క్రికెట్ గాడ్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. అమెరికన్ నటుడు డ్వేన్ జాన్సన్, లియోనార్డో డికాప్రియో, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామాతో పాటు పలువురు ప్రముఖులను వెనక్కు నెట్టిన సచిన్…ఈ జాబితాలో 35వ స్థానంలో నిలిచారు. బడుగు బలహీన వర్గాల కోసం సచిన్ నిరంతరం తన గళం విప్పుతున్నారని, పలు కీలక అంశాలపై తన ఉనికిని చాటుకుంటున్నాడని ఆ సంస్థ కితాబిచ్చింది.
సచిన్ అసోసియేట్ బ్రాండ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా ఉందని పేర్కొంది. గత దశాబ్దంగా యునిసెఫ్ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సచిన్…2013లో దక్షిణాసియాకు రాయబారిగా పనిచేశారు. సచిన్ భారతదేశంలోని గ్రామీణ, పట్టణాలలో ఆరోగ్యం, విద్య, క్రీడలలో అనేక కార్యక్రమాలకు మద్దతునిచ్చారు. అందుకే, ఆయనకు 35వ స్థానం దక్కింది. ఇక, ఈ జాబితాలో నిక్ జోనాస్, నిక్కీ మినాజ్, బియోంక్, లూయిస్ టాంలిన్సన్, బ్రూనో మార్స్, లియామ్ పేన్ , టకాఫుమి హోరి కూడా ఉన్నారు. ఈ జాబితాలో 61 శాతం మంది పురుషులు, 39 శాతం మంది మహిళలు ఉన్నారు.