తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలోని పాంబన్ వద్ద నిర్మించిన వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలో తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ దానిని జాతికి అంకితం చేశారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ పై మోదీ విమర్శలు గుప్పించారు. కొందరు కారణం లేకుండానే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారని స్టాలిన్ పై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేంద్ర ప్రభుత్వం నిధులివ్వడం లేదని, తమిళనాడును విస్మరిస్తోందని స్టాలిన్ చేసిన ఆరోపణలను మోదీ ఖండించారు. తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని, గత ప్రభుత్వంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులిచ్చామని మోదీ స్పష్టం చేశారు. గత దశాబ్దంలో తమిళనాడు అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, రైల్వే ప్రాజెక్టులకు నిధులు గణనీయంగా పెంచామని మోదీ తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
అభివృద్ధి చెందిన భారతదేశంలో తమిళనాడు పాత్ర గొప్పదని అభివర్ణించారు. తమిళనాడు ఎంత బలంగా ఉంటే భారతదేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. 2014కు ముందు తమిళనాడులో రైల్వే ప్రాజెక్టుకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవని, ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6,000 కోట్లకు పైగా ఉందని గుర్తు చేశారు. ఇక్కడ 77 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందని, ఇందులో రామేశ్వరంలోని రైల్వే స్టేషన్ కూడా ఉందని ఆయన తెలిపారు. తమిళ భాషలో సంతకాలు పెట్టాలంటూ మోదీ చురకలంటించారు.