ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఈ రోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం కరోనా రెండోదశ దేశాన్ని కుదిపేస్తోంది. నిన్న ఒక్కరోజే 638 మంది కరోనా కారణంగా మరణించారు. మరో లక్షన్నర మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రభుత్వాలు అల్లాడుతున్నాయి. మహారాష్ట్రలో అయితే.. నైట్ కర్ఫ్యూతోపాటు.. పలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఇక, కర్ణాటక, ఏపీలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది.
తెలంగాణలో నూ రోజు రోజుకూ కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ అలెర్ట్ అయ్యారు. ఇక, భారత్ నుంచి వచ్చే వారిని తమ దేశంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదని.. కొన్ని దేశాలు ప్రకటించడం.. మోడీ అవమానంగా భావిస్తున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు తక్షణ చర్యలు తీసుకునేందుకు ఆయన రెడీ అయినట్టు సమాచారం. ప్రధమ ప్రాధాన్యం కరోనాను అరికట్టడమేనని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం దాదాపు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఇక, బెంగాల్లో కూడా ఈ నెల 29తో ఎన్నికలు ముగియనున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు.
అయితే.. లాక్డౌన్ విధిస్తారా? లేదా? అన్నది మాత్రం సందేహంగా ఉంది. ప్రస్తుతం ప్రధాని మోడీ ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ వర్చువల్గా భేటీ అయి.. రెండో దశ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తారని సమాచారం. ఈ క్రమంలో తిరిగి కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. కంటైన్మెంట్ జోన్లను పెంచడం, కరోనా పరీక్షలు మరింతగా పెంచడంతో పాటు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం.. విందులు, వినోదాలు వంటి కార్యక్రమాలపై నిషేధం లేదా.. పరిమితి.. విధించడం, పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం వంటి కీలక అంశాలపై ప్రధాని మోడీ.. సీఎంలతో చర్చించే అవకాశం ఉంది. అదేసమయంలో కరోనాటీకా వృథా అవుతోందని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో ఈ వృథాను అరికట్టేందుకు కూడా మోడీ చర్యలు తీసుకుంటారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.