జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూశారు. నరా నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న షింజోపై యమగామి అనే మాజీ సైనికుడు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన షింజోను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మెడ భాగంలో తగిలిన బుల్లెట్లు తీవ్ర రక్తస్రావానికి కారణమై ఆయన మరణించారు. షింజోను ఆసుపత్రిలో చేర్చే సమయానికే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆసుపత్రిలో రక్తం ఎక్కించినా ప్రయోజనం లేకపోయిందని తెలుస్తోంది. షింజో అబే కన్నుమూసినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
షింజోపై నరా నగరానికి చెందిన యమగామి ఎట్సుయా కాల్పులు జరిపాడని పోలీసులు నిర్ధారించారు. షింజో అబే వెనుక వైపున నిలబడి10 అడుగుల దూరం నుంచే యమగామి నాటు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. యమగామి గతంలో సైన్యంలో పనిచేశాడు. మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ ఉద్యోగి అయిన యమగామి..2005 వరకు నేవీలో పనిచేశాడు. అయితే, అతడు షింజోను ఎందుకు చంపాడన్న కారణాలు తెలియాల్సి ఉంది.
కాగా, షింజో అబే మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. తన ఆత్మీయ మిత్రుడిని కోల్పోవడం ఎంతో బాధగా ఉందని మోదీ ట్వీట్ చేశారు. జపాన్‌తో పాటు ప్రపంచాన్ని ఉన్నత స్థితిలో చూసేందుకు షింజో ఎంతో కష్టపడ్డారని మోదీ ప్రశంసించారు. తమ బంధం ఇప్పటిది కాదని, తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి అబేతో పరిచయముందని అన్నారు. ప్రధాని అయిన తర్వాత కూడా తమ స్నేహ బంధం కొనసాగిందని తెలిపారు. తన ప్రియ మిత్రుడి మృతికి సంతాపంగా రేపు భారత్ లో జాతీయ సంతాప దినాన్ని పాటించబోతున్నారు.
షింజో అబే జపాన్ ప్రధాని హోదాలో.. 2017లో భారత్‌లో పర్యటించారు. జపాన్‌తో భారత్ హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఒప్పందం జరిగింది షింజో హయాంలోనే. అహ్మదాబాద్- ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు 2017 సెప్టెంబర్ 14న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే సమక్షంలో మోదీ శంకుస్థాపన చేశారు.