144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు. అందులోనూ, నిన్న అర్ధరాత్రి నుంచి మౌని అమావాస్య కావడంతో నిన్న ఒక్కరోజే దాదాపు 10 కోట్ల మంది భక్తులు వచ్చారని అంచనా. ఈ క్రమంలోనే త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులంతా ఒక్కసారిగా చేరుకోవడంతో బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది చనిపోయారని, 100 మందికి పైగా గాయపడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆ తొక్కిసలాట ఘటన విని తాను దిగ్భ్రాంతి చెందానని మోదీ అన్నారు. మృతి చెందిన భక్తుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని చెప్పారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మహా కుంభమేళాలో తొక్కిసలాటలో కొందరు భక్తులు మరణించడం, మరికొందరు గాయపడడం బాధాకరమని రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. క్షతగాత్రులకు సాయం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. అయితే, నిర్వహణ లోపం, వీఐపీల రాకపై అధికారుల ప్రత్యేక దృష్టి వంటివి ఈ తొక్కిసలాటకు కారణాలని ఆరోపించారు.
ఇక, సగం సగం పనుల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. వీఐపీల రాక, సెల్ఫ్ ప్రమోషన్ వంటివి ఆపాలని కోరారు. ముఖ్యమైన షాహీ స్నానాలు ఇంకా మిగిలి ఉన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.