- నోటీసును స్పీకర్‌కు పంపిన పెద్దిరెడ్డి, బొత్స
- గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో..
- తమను కించపరిచారని ఆరోపణ
- దానిని హక్కుల కమిటీకి పంపిన తమ్మినేని
- మహారాష్ట్ర కమిషనర్‌కు అక్కడి అసెంబ్లీ
- జైలు శిక్ష వేసిందని కమిటీ చైర్మన్ వాదన
- ఈ గవర్నర్ ఉలకరేం?
- రాజకీయ వర్గాల విమర్శ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశకుమార్పై కత్తిగట్టిన జగన్ ప్రభుత్వం.. ఆయన్ను తొలగించేందుకు చేసిన దుస్సాహసం ఎదురుకొట్టినా ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు. ఆయన హయాంలో స్థానిక ఎన్నికలు జరిపేది లేదని భీష్మించుకుని.. సహాయ నిరాకరణ చేసి.. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మొట్టికాయలు పడేసరికి దిగివచ్చింది. అయినా అడుగడుగునా ఆయనకు అడ్డుతగలడమే గాక.. ఇప్పుడు ఎలాగైనా ఆయన్ను జైలుకు పంపాలని చూస్తోంది. సీఎం నుంచి వైసీపీ కింది స్థాయి నేతల వరకు నిమ్మగడ్డను దుర్భాషలాడుతున్నారు.
ముఖ్యంగా మంత్రులు పెద్దిరెద్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అసభ్య పదజాలంతో నిందిస్తున్నారు. దీనిపై నిమ్మగడ్డ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. అందులో తమను కించపరిచేలా, తమ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆరోపణలు చేశారని ఈ మంత్రులిద్దరూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. దానిని ఆయన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించింది.
నిమ్మగడ్డకు నోటీసులు పంపే విషయమై చర్చించినట్లు తెలిసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కమిషనర్ ఫిర్యాదు చేసింది గవర్నర్‌కు కదా! అందులో అభ్యంతరకరమైనవి ఉంటే ప్రశ్నించాల్సింది గవర్నర్. ఆయన వద్ద ఉన్న ఫిర్యాదు ఆధారంగా మంత్రులు ప్రివిలేజ్ కమిటీకి ఎలా వెళ్తారని న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు.
మాకా అధికారం ఉంది: కమిటీ చైర్మన్
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలను విచారించే అధికారం అసెంబ్లీ హక్కుల కమిటీకి ఉందని సదరు కమిటీ చైర్మన కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు. తమ హక్కులకు భంగం కలిగిందని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇచ్చిన నోటీసును స్వీకరించామని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ఓ శాసనసభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రివిలేజ్ కమిటీ విచారించి కమిషనర్‌కు 2008లో ఏడు రోజులు జైలు శిక్ష విధించిందన్నారు.
నిమ్మగడ్డ తమపై నిరాధారమైన ఆరోపణలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స చేసిన ఫిర్యాదును స్పీకర్ హక్కుల కమిటీకి పంపడంతో తాము చర్చించినట్లు చెప్పారు. ఈ ఫిర్యాదుపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని.. దీనిపై సభ్యులంతా నేరుగా కూర్చుని మరో దఫా పూర్తి స్థాయి విచారణ జరిపి అసెంబ్లీ తీర్మానానికి నివేదిస్తామని తెలిపారు.
మహారాష్ట్రలో ఏం జరిగింది..?
మహారాష్ట్రలో అక్కడి ఎన్నికల కమిషనర్ నంద్లాల్పై ప్రివిలేజ్ కమిటీ విచారించి శిక్ష విధించాలని అసెంబ్లీకి సిఫారసు చేస్తే.. సభ రెండ్రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్మానం విధించింది. దీని వెనుక పెద్ద కథే ఉంది. మహారాష్ట్రలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు.. నాటి సీఎం విలాస్‌రావు దేశ్‌ముఖ్ (కాంగ్రెస్) తన సొంత జిల్లా లాతూర్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నందలాల్‌కు కొన్ని సూచనలు చేశారు. ఆయన వాటిని పట్టించుకోలేదు. ఆ సందర్భంగా సీఎం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని నంద్లాల్పై ఓ కాంగ్రెస్ సభ్యుడు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.
2008లో దీనిపై కమిటీ విచారణ జరిపింది. తన ముందు హాజరవ్వాలని కమిటీ ఆదేశించినా కమిషనర్ పట్టించుకోలేదు. దీంతో ఆయనకు జైలు శిక్ష విధించాలని కమిటీ సిఫారసు చేసింది. ఆయనకు రెండ్రోజులు శిక్ష విధిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. కమిటీ ముందు హాజరు కాకపోవడం చట్టసభ పట్ల ధిక్కారమేనని ఆ రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టం చేసింది. దీనిని సాకుగా తీసుకుని నిమ్మగడ్డను జైలుకు పంపాలని జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎన్నికల నిర్వహణతో తీరిక లేకుండా ఉన్న కమిషనర్‌ను ఫలానా రోజు రావాలని ఆదేశించి.. ఆయన రాకపోతేవెఎంటనే శిక్ష విధించాలన్నది దాని ఎత్తుగడగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఎమ్మెల్సీకే సభా హక్కుల నిబంధన వర్తించదని గతంలో వాదించిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే నిబంధనను ఎన్నికల కమిషనర్‌కు ఎలా వర్తింపజేస్తారని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. సభా హక్కుల కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆయన ఆ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు.
‘శివనాథరెడ్డి అనే టీడీపీ ఎమ్మెల్సీ వైసీపీలో చేరితే ఆయనపై మా పార్టీ సభా హక్కుల నోటీసు ఇచ్చింది. ఆయన్ను గవర్నర్ నియమించారు కాబట్టి.. సభా హక్కులు వర్తించవని అప్పుడు వైసీపీ నేతలు వాదించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కూడా గవర్నరే నియమించారు. మరి ఎమ్మెల్సీకు వర్తించని ఈ నిబంధన కమిషనర్‌కు ఎలా వర్తిస్తుందని కమిటీ సమావేశంలో లేవనెత్తాను. ఆర్టికల్ 243 ప్రకారం ఎన్నికల కమిషనర్‌కు పూర్తి అధికారాలు ఉంటాయి. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యకు అవకాశం లేదని కూడా చెప్పాను’ అని తెలిపారు.
ఎన్నికల కమిషనర్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇటువంటి ఫిర్యాదులు తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ‘ఎన్నికల కమిషనర్‌ను తీవ్రమైన పదజాలంతో విమర్శించిన మంత్రులపై చర్యలు తీసుకోకుండా ఎన్నికల కమిషనర్‌పై చర్యలు తీసుకుంటామంటే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. శాసనసభ స్పీకర్ సభ్యుల హక్కులను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకొంటున్నారు. మా సభ్యుల హక్కులను ఉల్లంఘించడంపై మేం అనేక సార్లు ఫిర్యాదులు ఇచ్చినా ఆయన స్పందించలేదు. కానీ మంత్రులు చేసిన ఫిర్యాదులపై ఆగమేఘాలపై స్పందించడం విస్మయం కలిగిస్తోంది.
సభా హక్కుల కమిటీ నవ్వులపాలయ్యేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ అని ఆక్షేపించారు. కాగా.. ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషనర్‌ను రోజూ అసభ్య పదజాలంతో చెడతిట్టిపోస్తున్న మంత్రులపైన.. ఎన్నికలకు ప్రభుత్వ సహాయ నిరాకరణపైన కమిషనర్ తనకిచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకుని రాజ్యాంగ సంస్థ అధిపతిని ఎలా ప్రివిలేజ్ కమిటీ విచారిస్తుందని ఎందుకు అడగడం లేదని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులను ఆయన దృష్టికి తీసుకురావడానికి రెండు వారాలుగా టీడీపీ ప్రయత్నిస్తున్నా.. వారికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం గమనార్హం.
పెద్దిరెడ్డి నోటికి హైకోర్టు తాళం..
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరగడంతో వాటి ఫలితాలను ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఎన్నికల అధికారులను ఆదేశించారు. వాటిపై సునిశిత విచారణ జరపాలని కలెక్టర్లను ఆదేశించారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి తిరుపతిలో విలేకరుల సమావేశం పెట్టి మరీ అధికారులను బెదిరించారు. ఏకగ్రీవాల డిక్లరేషన్లను ఇవ్వని రిటర్నింగ్ అధికారుల జాబితా తీసుకుని.. మార్చి 31 తర్వాత.. అంటే నిమ్మగడ్డ రిటైరైన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు ఆందోళన చెందారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పెద్దిరెడ్డిని ఈ నెల 21 వరకు ఇంటి నుంచి బయటకు రానివ్వొద్దని.. మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. మంత్రి హైకోర్టును ఆశ్రయించగా.. ఇంట్లోనే ఉంచాలన్న కమిషనర్ ఆదేశాలను న్యాయస్థానం కొట్టేసింది. కానీ ఆయన విలేకరులతో మాట్లాడడానికి వీల్లేదని ఆంక్ష విధించింది.