రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ కు ఇచ్చారంటూ ప్రచారంలో ఉన్న ఒక సలహా చాలా విచిత్రంగా ఉంది. ఇంతకీ ఆ సలహా ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడేందుకు పొత్తులకు సంబంధించిన సలహా పీకే ఇచ్చారట. ఇంతకీ అదేమిటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఒంటరి పోరాటం చేయాలని చెప్పారట. అదే ఏపీకి వచ్చేసరికి వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని సోనియాగాంధీకి ఇచ్చిన రిపోర్టులో పీకే స్పష్టంచేశారట.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లో 358 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయాలని పీకే ప్రతిపాదించారట. ఇక పొత్తుల్లో భాగంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుంటే పార్టీ లాభపడుతుందనే విషయాన్ని కూడా పీకే చెప్పారట. తమిళనాడులో డీఎంకేతో, పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో ఎన్సీపీతో, ఝార్ఖండ్ లో జేఎంఎంతో కలిసి వెళ్ళటం మేలని పీకే రిపోర్టు ఇచ్చినట్లు ఓ సెక్షన్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటికే కాంగ్రెస్ తమిళనాడులో డీఎంకేతో కలిసుంది. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్+ఎన్సీపీలు మిత్రపక్షాలే. మరి ఈ విషయాలు పీకేకు తెలీకుండానే ఉంటుందా ? ఆల్రెడీ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని పీకే చెబుతారా ? లేకపోతే పీకే పేరుతో అచ్చేసిన కథనం రాసిన మీడియాకు తెలీదా ? ఏమిటో పీకే పేరుతో రాసిన కథనం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇదే సందర్భంలో ఏపీలో వైసీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని పీకే ప్రతిపాదించరనే విషయం కూడా నమ్మేట్లుగా లేదు.
రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులు, వైసీపీ పుట్టుక, కాంగ్రెస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు తెలియనంత అమాయకుడు కాదు పీకే. కాంగ్రెస్ తో జగన్ పొత్తుకు ఇష్టపడరని తెలిసీ పీకే అలాంటి ప్రతిపాదన చేశారంటే ఎవరు నమ్మటం లేదు. కాంగ్రెస్ కోణం నుండి పీకే ప్రతిపాదన బ్రహ్మాండమే కానీ వైసీపీ కోణంలో చూస్తే చెత్త ప్రతిపాదననే చెప్పాలి.