వైసీపీ నేత, మాచెర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. హత్యాయత్నం, ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మాచర్ల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలింగ్ రోజు పాల్వాయి గేట్ అనే గ్రామం పోలింగ్ బూత్ లో ఈవీఎంలను పగలగొట్టి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులతో పాటు టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
అలాగే పోలింగ్ అనంతరం కారంపూడిలో దాడి కేసులో సీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై మరో హత్యాయత్నం కేసు కూడా రిజిస్టర్ అయింది. మొత్తం నాలుగు కేసులు నమోదు కావడంతో అరెస్ట్ చేస్తారని భావించి పిన్నెల్లి హైదరాబాద్ పారిపోయారు. ప్రత్యేక బృందాలు గాలించినా ఆయన దొరకలేదు. ఈలోగా ఆయా కేసుల్లో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి పిటిషన్లు వేశారు.
గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే బాధితులు ఈ మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లగా.. హైకోర్ట్ నిర్ణయం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లుపై వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేసింది. అలాగే పిన్నెల్లి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టి పారేసింది. బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసిన నిమిషాల్లోనే పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్లిని నర్సరావుపేటలోని ఒక హోటల్లో అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడ నుంచి కాసేపట్లో మాచర్ల కోర్టుకు తరలించే అవకాశాలు ఉన్నాయి.