అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. రాజకీయాల్లోనూ అంచనాలకు మించిన విధంగా నిర్ణయాలు వచ్చేస్తుంటాయి. చర్యకు ప్రతిచర్య అన్నది కామన్. శాశ్విత శత్రుత్వం కానీ మిత్రత్వం కాని ఉండని రాజకీయాల్లో అలాంటివి మరింత ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్కిల్ స్కాంలో ఏపీ విపక్ష నేత చంద్రబాబు అరెస్టు కావటం.. రిమాండ్ లో భాగంగా రాజమహేంద్రవరం జైల్లో ఉండటం తెలిసిందే.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. చంద్రబాబు అరెస్టు సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఏపీలో భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయని చెప్పాలి. ఎప్పుడైనా.. ఎక్కడైనా కీలక నేతల అరెస్టు జరిగినప్పుడు ఆందోళనలు.. నిరసనలు సహజం. అయితే.. ఇవి హద్దు మీరేలా ఉండి.. శాంతిభద్రతల సమస్యకు కారణమైతే చర్యలు తీసుకోవటం కామన్. అందుకు భిన్నంగా.. నిరసన అన్నదే కనిపించకూడదన్నట్లుగా వ్యవహరించిన పోలీసుల తీరు చాలామందిని ఆగ్రహానికి గురి చేసింది.
సామాన్యుల విషయాన్ని వదిలేస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం వరుస పెట్టి చేదు అనుభవాలు ఎదురుకావటం సంచలనంగా మారింది. చంద్రబాబు అరెస్టు గురించి క్లారిటీ వచ్చిన వేళ.. విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరేందుకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లిన పవన్ కల్యాణ్ కు.. ‘అనుమతులు’ లేవంటూ ఆపేయటంతో.. వెంటనే రోడ్డు మార్గాన బయలుదేరారు. ఏపీ సరిహద్దుల్లోకి ప్రవేశించిన కాసేపటికే ఆయన కార్లను ఆపేయటం.. దీంతో నడక మొదలు పెట్టిన పవన్ ను అడ్డుకునేందుకు పోలీసులు పడిన ప్రయాస చూసినప్పుడు.. ఎందుకింతలా అడ్డుకోవటం అన్నది ప్రశ్నగా మారింది.
ప్యాకేజీ స్టార్.. పావలా పవన్.. మూడు భార్యల పవన్.. రెండుచోట్ల పోటీ చేసినా ఎమ్మెల్యేగా గెలవలేని అసమర్థుడు లాంటి ట్యాగ్ లైన్లు ఎన్నో పెట్టే ఆయన రాజకీయ ప్రత్యర్థులకు పవన్ అంటే ఎందుకంత ఉలికిపాటు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎందుకంతలా విరుచుకుపడతారు? విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు? ఆయన విధానాలు తప్పు అంటూ సంబంధం లేని అంశాల్ని.. ఆధారాలు చూపని ఆరోపణల్ని సంధిస్తారు? అన్న మాట పలువురి నోట వినిపిస్తున్న పరిస్థితి.
తాను ఏ తప్పు చేయకున్నా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో తనకున్న ప్రాధమిక హక్కుల్ని కాలరాచేస్తున్న వారిపై పోరాడాలన్న భావన ఎవరికి ఉండదు? అందుకు పవన్ కల్యాణ్ అతీతుడు కాదు కదా? ఎన్నికల్లో డబ్బులు పంచకూడదన్న తన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నందుకు దక్కిందేంటి? అంటే… రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల గెలవలేని అల్ప నాయకుడిగా పేరు. ఆదర్శాలు నోటి మాటగా కాదు.. చేతల్లో చూపించాలన్న ఆశ.. ఆకాంక్షకు తగ్గట్లుగా వ్యవహరించిన దానికి దక్కిన ఫలం ‘హీరో కాదు జీరో’ అంటూ ఎక్కెశాలు. రూపాయి కూడా లబ్ధి పొందకుండా ప్యాకేజీ స్టార్ అంటూ మాటలు పడే పవన్ కు ఎక్కడో ఒకచోట.. ఎప్పుడో ఒకప్పుడు కాలకూడదా?
చంద్రబాబును ఎప్పుడైనా విమర్శించావా? ప్రశ్నించావా? అని అడిగేటోళ్లు.. అలా ప్రశ్నించిన రోజున చెవులు మూసుకొని ఉన్నారా? విమర్శించిన వారితో ఎలా కలుస్తావు? అంటూ ప్రశ్నించే వారు.. కాంగ్రెస్ తో పేచీ పడి బయటకు వచ్చిన దివంగత మహానేత వైఎస్.. ఆ తర్వాత కాలంలో మళ్లీ పార్టీలోకి చేరటాన్ని ఏమనాలి? తండ్రి ఆకాంక్షను నెరవేర్చాలన్న మాటే నిజమైనప్పుడు.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న వైఎస్ ఆకాంక్ష ఎందుకు గుర్తుకు రాదు? ఎందుకు నెరవేర్చరు? అన్నది ప్రశ్న.
దీనికి సమాధానాలు ఇవ్వకుండా పవన్ ను అదే పనిగా ప్రశ్నించే తీరే.. పవన్ చేత కీలక నిర్ణయాన్ని తీసుకునేలా చేసింది. రాజకీయాల్లో లెక్కలకు ఉండే ప్రాధాన్యత.. ప్రాముఖ్యత తెలియంది కాదు. కానీ.. వాటికి సైతం తాను అతీతంగా ఉంటానన్న మాట.. రాజమహేంద్రవరం జైలు బయట పవన్ నోట వచ్చిన పొత్తు మాట తేల్చేసిందని చెప్పాలి. ఉమ్మడి శత్రువును ఒంటరిగా ఎదుర్కోవాలన్న నీతుల్లోని నిజం ఏమిటో తెలిసిందే. శత్రువును ఎదుర్కోవటం అన్నది న్యాయబద్ధంగా ఉండాలే తప్పించి.. దానికి ఎంచుకునే దారి నిబంధనలకు అనుగుణంగా వెళుతుంటే నొప్పి ఎందుకు కలుగుతుంది? అన్నదే అసలు ప్రశ్న. చాలామందికి ఆన్సర్ కూడా అర్థమైపోతోంది.