అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా Phalana Abbayi Phalana Ammayi కొత్త సినిమాను అనౌన్స్ చేసి కొన్నేళ్లవుతోంది. అవసరాల తొలి రెండు చిత్రాల్లోనూ నాగశౌర్యే హీరోగా నటించగా.. అవి రెండూ మంచి ఫలితాన్నందుకున్నాయి. వీరి కలయికలో మూడో సినిమా ఫలానా అబ్బాయి ఫలానామా అమ్మాయి రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది.
ఎట్టకేలకు ఈ ఏడాది సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. సినిమాలు సరిగా ఆడని డల్ సీజన్లో, మార్చి 17న రిలీజ్కు సన్నాహాలు చేయడంతో ముందు ఏమంత బజ్ కనిపించలేదు. ఈ సినిమా టీజర్ బాగానే అనిపించినా సరే.. సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నుంచి తొలి పాట రిలీజ్ చేశాక కథ మారిపోయింది.
కనుల చాటు మేఘమా.. అంటూ సాగే ఆహ్లాదకరమైన పాటను అద్భుతంగా కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్. తొలి సినిమా ఐతే దగ్గర్నుంచి ప్రతి చిత్రంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూనే వస్తున్న కళ్యాణి.. అవసరాల సినిమాల్లో మరింత ప్రత్యేకమైన పాటలే ఇస్తాడు. ఆ ఒరవడిని కొనసాగిస్తూ.. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కోసం మెస్మరైజింగ్ మెలోడీ అందించాడు. డైలాగ్ రైటర్ లక్ష్మీభూపాల ఈ పాటకు సాహిత్యం సమకూర్చడం విశేషం.
హిందీ గజల్స్ తరహాలో సాగిన ఈ పాటను అబ్బాస్ జోషి చాలా హృద్యంగా ఆలపించాడు. ఈ పాట విడుదలవగానే ఇన్స్టంట్ హిట్టయింది. సినిమా ఎంత ఆహ్లాదంగా ఉండబోతోందో ఈ పాట సంకేతాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ పాటపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమా కోసం జనాలు ఎదురు చూసేలా చేస్తోంది. రిలీజ్ లోపు ఇలాంటి ఇంకో రెండు పాటలు లాంచ్ అయితే హైప్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.