దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఏ మూడు మాసాలకో రెండు, మూడు రూపాయలు పెంచితే.. దేశవ్యాప్తంగా గగ్గోలు పుట్టి.. నిరసనలు రోడ్డెక్కేవి. అయితే.. ఈ విధానాన్ని మార్చిన గత యూపీఏ సర్కారు.. ఏ రోజు వాత ఆరోజే అంటూ.. నొప్పి తెలియకుండా వాతలు పెట్టడానికి పెట్రో కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఫలితంగా ఇప్పుడు రోజు వారిగా.. పెట్రో ధరలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పైసల లెక్కన పెంచుతూ.. రూపాయల లెక్కల్లో జనాల జేబులు గుల్ల చేస్తున్నాయి.
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు గత నెలలో దాదాపు 16 సార్లు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పెట్రోల్ రేటు (లీటర్కు) రూ.100 దాటింది. ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. లీటర్కు రూ.100 అనేది మన దేశంలో చాలా ఎక్కువనే చెప్పాలి. మరి పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంలోనే భారీగా ఉన్నాయా? ప్రపంచంలో ఇంధన ధరలు అత్యధికంగా ఉన్న దేశాలు ఏవి? అత్యల్పంగా ఇంధన ధరలు ఉన్న దేశాలు ఏవి? ఇందులో భారత్ ర్యాంక్ ఎంత? అనే వివరాలు ఆసక్తిగా మారాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లీటరు పెట్రోలుకు అత్యధిక ధర వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ 58వ స్థానం లో ఉంది. అయితే.. త్వరలోనే అంటే.. ఈ ఏడాది చివరి నాటికి.. రెండు మూడు స్థానాల్లోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎక్కువ ధరలు ఉన్న దేశాలు ఇవీ..
హాంకాంగ్ లీటరు పెట్రోలు 181.72 రూపాయలు, నెదర్లాండ్స్ లో లీటరు పెట్రోలు ధర.. 159.27 రూపాయలు, నార్వే 150.35 రూపాయలుగా ఉన్నాయి. ఈ వరుసలో మన దేశం రూ.100 తో 58వ స్థానంలో ఉందని తాజాగా.. నీతి ఆయోగ్ వెల్లడించింది.
అంటే..అల్పాదాయ దేశాల్లోనే పెట్రోల్ ధరలు ఇలా ఉంటే.. మన దగ్గర పెంచితే తప్పులేదనేది కేంద్రం వాదనగా ఉంది. దీనిని బట్టి త్వరలోనే పెట్రో ధరల విషయంలో మరిన్ని మార్పులు రావడం.. లీటరు పెట్రోలు రూ.150వరకు చేరడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. దీనిపై ఆర్థిక నిపుణులు మాత్రం మౌనం పాటిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అన్ని రంగాలు కుప్పకూలినా.. ఒక్క ఇంధన రంగం మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూపాయలు కుమ్మరిస్తోంది. ఈ నేపథ్యంలో ధరలను మరింత పెంచే అవకాశం లేకపోలేదని.. ఇదిరూ.150 వరకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరి మోడీ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.