ఏపీలో పీఆర్సీ పంచాయితీ రచ్చ రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ, ఉద్యోగులతోపాటు టీచర్లు కూడా ఉద్యమబాటపట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల ముట్టడికి టీచర్లు యత్నించడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ షాక్ నుంచి ప్రభుత్వ పెద్దలు తేరుకోకముందే…తాజాగా పీఆర్సీ పంచాయతీ హైకోర్టుకు చేరింది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో జగన్ కు షాక్ తగిలినట్లయింది.
విభజన చట్ట ప్రకారం సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించకూడదని ధర్మాసనం దృష్టికి జేఏసీ తీసుకెళ్లింది. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని పిటిషన్లో కోరింది. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు…దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు, ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుండగానే.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించడం వివాదాస్పదంగ మారింది. సవరించిన పే స్కేల్స్ ప్రకారం జీతాలివ్వాలని ట్రెజరీలకు ఆదేశాలు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
అంతకుముందు, పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు లంచ్ బ్రేక్ టైమ్లో ధర్నా చేపట్టారు. మూడో బ్లాక్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ..సెక్రటేరియట్లో భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయమైన హెచ్ఆర్ఏ, సీసీఏలతో కూడిన జీవోలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. రాత్రికి రాత్రే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంపై ఉద్యోగులు అసహనం, అసంతృప్తి, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ జీవోలు రద్దు చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.