తిరుమల శ్రీవారి లడ్డూ ఉదంతానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ కు చికాకు పుట్టేలా ఒక పిటిషన్ ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దాఖలు చేశారు. లడ్డూలో పందిమాంసం.. చేప కొవ్వులతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.
హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు మాంసంతో చేసిన నెయ్యి కలిసిందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు ఏమున్నాయి? అన్నది ఆయన పరశ్న. పవన్ వ్యాఖ్యలు చూసినప్పుడు ఆయన ఏపీకి డిప్యూటీ సీఎం అన్న విషయాన్ని మర్చిపోయి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటాన్ని తప్పు పట్టారు.
ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సైతం తప్పు పట్టిందన్న ఆయన.. ఇంటర్నెట్ లో పవన్ మాట్లాడిన మాటల్ని డిలీట్ చేయాలని కోరారు. తిరుపతి లడ్డూ వివాదంపై సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ కేసును ఈ రోజు (మంగళవారం) కోర్టు విచారించనుంది.