ఉత్తరాంధ్రలోని రణస్థలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన యువశక్తి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారటంతో పాటు అధికార వైసీపీ నేతలు రాత్రి వేళ హడావుడిగా మైకులు పట్టుకునేలా చేసింది. గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పవన్ తన ప్రసంగాన్ని పూర్తి చేస్తే.. దానికి కాసేపటికే పలువురు వైసీపీ నేతలు పవన్ వ్యాఖ్యలపై తమ కౌంటర్లను తెలిపే విషయంలో పోటీ పడ్డారు. ఈ విషయంలో మాజీ మంత్రి పేర్ని నానికి క్రెడిట్ దక్కుతుంది. మిగిలిన వైసీపీ నేతల కంటే ముందుగా ఆయనే రియాక్టు అయ్యారు.
ఎప్పటిలానే అడ్డగోలు వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. పవన్ వ్యాఖ్యల్లో పస లేదని.. సొంత డబ్బా కొట్టుకున్నారన్న వ్యాఖ్య చేశారు. ఒకవేళ.. అదే నిజమైతే.. అంత హడావుడిగా కౌంటర్ ఇవ్వటానికి పేర్ని నాని అంత తహతహలాడిపోయారెందుకు? ‘‘ఏరా.. ఒకే అనడమేనా నీ సంస్కారం? దిగజారుడు స్వభావం గల వ్యక్తి పవన్. ఇదేనా నీ వ్యక్తిత్వం? మైకు దొరికిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? నీ ప్రసంగం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? పవన్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి.. పరనింద.. సినిమా డైలాగ్స్ కే సరిపోయింది. పవన్ మూడు ముక్కల రాజకీయ నాయకుడు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి. ఓవైపు బీజేపీతో.. మరోవైపు టీడీపీతో రాజకీయం? నీకు వచ్చినవి దిక్కుమాలిన రాజకీయాలే. కాపులనుమోసం చేశావు. బీసీలను మోసం చేశావు. స్టేజ్ మీద బీసీలను ఎందుకు కూర్చోబెట్టలేదు? ఆయనవి బిల్డప్ బాబాయ్ మాటలు. మాది నియంత ప్రభుత్వమైతే మీ మీటింగ్ కు పర్మిషన్ వస్తుందా?’’ అంటూ మండిపడ్డారు.
ఒకవేళ పేర్ని నాని మాటల్నే పరిగణలోకి తీసుకుంటే.. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన్ను.. ఆయన వ్యక్తిగత జీవితాన్ని అదే పనిగా మాట్లాడింది ఎవరు? అన్నది ప్రశ్న. నిజానికి..ఈ మాటల్ని అనేసే విషయంలో పేర్ని నాని.. అంబటి రాంబాబు.. ఆర్కే రోజా..కొడాలి నాని.. వల్లభనేని వంశీ లాంటి ఎంతోమంది ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు మూసుకొని కూర్చోలేరు కదా? తాము పవన్ గురించి మాట్లాడిన ప్రతిసారీ ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడే పేర్ని నాని కానీ.. ముఖ్యమంత్రి జగన్ కానీ అదంతా చట్టబద్ధంగా జరిగిన వ్యక్తిగత వ్యవహారమన్న విషయాన్ని వదిలేసి.. పవన్ క్యారెక్టర్ ను దెబ్బ తీసేందుకు చూపించిన ఉత్సాహంతో పోల్చినప్పుడు పవన్ రియాక్షన్ లో తప్పేముంది? అన్న ప్రశ్న తలెత్తక మానదు.
తాము ఏమైనా అనొచ్చు? ఎన్ని మాటలైనా అనేయొచ్చు కానీ తమను మాత్రం కించిత్ మాట కూడా మాట్లాడకూడదన్న ధోరణి దేనికి నిదర్శనం పేర్ని నాని? అన్నది ప్రశ్న. నిజానికి ఈ తిట్ల రాజకీయాలకు తెర తీసింది వైసీపీ నేతలే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదే పనిగా మాటలతో రెచ్చగొట్టేస్తూ.. దానికి ఘాటుగా రియాక్టు అయినప్పుడు మాత్రం భరించలేనంత ఉక్రోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పేర్ని నాని లాంటి వారి మాటలు వర్కువుట్ అవుతాయా? అన్నదే అసలు ప్రశ్న. నీతులు చెప్పే ముందు.. వాటిని తాము పాటించాల్సి ఉంటుందన్న కనీస ధర్మాన్ని మరిచిపోయి మాట్లాడే పేర్ని నాని.. నీతులు చెప్పాల్సిన రావటమే అసలుసిసలు రాజకీయంగా చెప్పకతప్పదు.