మరోసారి జగన్ పాలన పై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఎన్నికల ప్రచారం రథం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వచ్చిన సందర్భంగా పవన్ …ప్రభుత్వంపై మండిపడ్డారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విడిపించడమే జనసేన ప్రచార రథం వారాహి లక్ష్యమని పవన్ అన్నారు. ఏపీ సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు ముందుండాలని తాను కోరుకుంటానని అన్నారు.
మంగళవారం కొండగట్టు, ధర్మపురిలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్…ఆ తర్వాత బుధవారం నాడు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అయితే, కొండపైకి వారాహి వాహనాన్ని అధికారులు అనుమతించలేదు. దీంతో, ఘాట్ రోడ్ లోని అమ్మవారి విగ్రహం ముందు వారాహికి పవన్ పూజలు చేశారు. అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉంటుందని, వారాహితో అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పవన్ అన్నారు.
ప్రచార రథానికి పూజ చేసేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చానని, రాష్ట్రంలో జరిగే అరాచకాలను అమ్మవారు చూస్తోందని పవన్ అన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయం లోపలికి పవన్ తోపాటు కొంతమంది ముఖ్యనేతలను మాత్రమే అధికారులు అనుమతించారు. పవన్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని కూడా అనుమతించలేదు. పవన్ రాకతో బెజయవాడలోని ఇంద్రకీలాద్రి, ఘాట్ రోడ్ కు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని పవన్ కు ఘన స్వాగతం పలికారు. పవన్ కు, వారాహి వాహనానికి గజమాల వేసి సత్కరించారు. ప్లై ఓవర్ పై నుంచి పవన్ పై పూల వర్షం కురిపించారు.