ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కొంతకాలంగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా తమకు రావలసిన నీటిని ఆంధ్రాకు జగన్ తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి, ట్రైబ్యునల్ కు కూడా సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ప్రాజెక్టుపై ఎన్జీటీ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ప్రాజెక్టు విషయంలో జగన్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులను కేంద్ర పర్యావరణ శాఖ వాయిదా వేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 6 అంశాలపై కేంద్ర పర్యావరణ మదింపు శాఖ వివరణ కోరింది. అంతేకాదు, ఎన్జీటీ అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాలని కేంద్ర పర్యారణ శాఖ ఆదేశించింది. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టమైన డ్రాయింగ్స్, లేఅవుట్లు, చార్ట్‌లను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
దీంతోపాటు, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన స్థల సేకరణ, ఆయకట్టు వివరాలనూ సమర్పించాలని కేంద్రం కోరింది. ఈ పథకం ద్వారా ఎంత నీటిని వాడుకోవాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని ఆదేశించింది. గతంలో తెలుగుగంగ ప్రాజెక్ట్‌కు ఇచ్చిన అనుమతులలో ఏపీ సవరణ కోరగా…ఆ దరఖాస్తులో స్పష్టత కొరవడిందని పర్యావరణ మదింపు శాఖ తెలిపింది. దీంతో, ఈ పథకం వ్యవహారంలో జగన్ కు కేంద్రం షాకిచ్చినట్లయింది.