రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. తమ ఇళ్లకు స్టిక్కర్లు అంటించొద్దంటూ.. చాలా ప్రాంతాల్లో ప్రజలు మొహం మీదే చెప్పేశారు. అన్ని ధరలు పెంచేశారని, పథకాలు అందడం లేదని, వస్తున్న పథకాలను ఏదో కారణాలు చెప్పి మధ్యలోనే ఆపేస్తున్నారని జనం నిలదీశారు. తమ సెల్ఫోన్లకే కాదు.. ఇంటికీ స్టిక్కర్లు అంటించొద్దని చాలాచోట్ల వ్యతిరేకించారు.
అయితే.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. అనంతపురం నుంచి అంబేడ్కర్ కోనసీమ వరకు దాదాపు అన్ని జిల్లాల్లోనూ వాలంటీర్లతోనే ఈ కార్యక్రమాన్ని నడిపించారు. సచివాలయ కన్వీనర్, గృహసారథులను ఇంటింటికీ తీసుకెళ్లి వాలంటీర్లే పరిచయం చేశారు. చాలాచోట్ల స్టిక్కర్లూ వాళ్లే అతికించారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఎన్టీఆర్ కాలనీలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి తక్కువ సంఖ్యలో ప్రజలు రావడంతో ఆయన కౌన్సిలర్లపై మండిపడ్డారు. ఇంటింటికీ వెళ్లినప్పుడు.. మూడు నెలలుగా నీళ్లు రావడం లేదని చాలా మంది ప్రశ్నించారు. మా సమస్యలు పరిష్కరించాలని వారు ప్రశ్నించారు.
నాయుడుపేటలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నాయుడుపేట పట్టణ వైసీపీ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి గైర్హాజరవడం పార్టీలో వర్గ విభేదాలను బహిర్గతం చేసింది. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి అయిదారు ఇళ్లకే వెళ్లి మమ అనిపించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎన్టీఆర్ కాలనీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యక్రమానికి హాజరయ్యారు. నాలుగు నెలలుగా రేషన్ బియ్యం సరిగా ఇవ్వడం లేదని కొందరు మహిళలు ఆయనకు చెప్పారు. సాయంత్రం ఇంటికి వస్తే మాట్లాడదామని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి చాలా చోట్ల స్టిక్కర్ల కార్యక్రమం అభాసుపాలైందనే విమర్శలు వచ్చాయి.