అమరావతి భూముల్లో పేదలకు సెంటు లెక్కన భూమి ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేసే విషయంలో ముఖ్యమంత్రి ఎంతటి దూకుడు ప్రదర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రాజధానిగా నిర్ణయించిన అమరావతిలో వేలాది మంది పేదలకు సెంటు (గజాల్లో 48.4) చొప్పున భూమిని పేదలకు ఇచ్చేందుకు జగన్ సర్కారు నడుం బిగించిందన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సెంటు భూమిని లబ్థిదారులకు ఇచ్చేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
శుక్రవారం నిర్వహించే కార్యక్రమంలో సెంటు భూమి పత్రాల్ని లబ్థిదారులకు అందించేందుకు ప్రయత్నాలు పూర్తి అయ్యాయి. ఇలాంటి వేళలో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మంగళగిరి గండాలయపేటకు చెందిన నిరుపేదలకు సెంటు భూమి ఇస్తామని అధికారులు చెప్పటంతో పాటు.. సీఎం పాల్గొనే సభకు హాజరు కావాలని కోరారు. అందుకు.. నో అని తేల్చేశారు కాలనీ వాసులు.
ఎందుకిలా? అంటే.. వారి వాదన భిన్నంగా ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కొండలపై చాలామంది నివసిస్తున్నారని.. వారికి లేని ఇబ్బంది మంగళగిరి కొండపై జీవించే వారికి ఎందుకు ఉండదు? అని ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో స్థలాలు ఇవ్వటాన్ని తాము నమ్మలేమని చెప్పటం గమనార్హం. అంతేకాదు.. తామున్న చోటుకు పట్టాలు ఇచ్చేస్తే సరిపోయేదానికి.. రాజధాని ప్రాంతంలో సెంటు స్థలం ఇవ్వాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి సభకు హాజరు కావాలంటూ సచివాలయ సిబ్బంది అడగ్గా.. తాము సభకు రాలేమని తేల్చి చెబుతున్నారు. ఎంతో కాలం క్రితమే తాము ఇళ్లను నిర్మించుకున్నామని.. అలాంటప్పుడు కొత్తగా భూమిని ఇచ్చే బదులు.. తాము సొంతంగా కట్టుకున్న ప్రాంతాల పట్టాల్ని తమకు ఇచ్చేస్తే సరిపోతుందని చెబుతున్నారు.
అందుకు భిన్నంగా సెంటు భూమిని ఇవ్వటం ద్వారా.. మళ్లీ అక్కడ ఇంటిని నిర్మించుకునే స్తోమత లేదని వారు తేల్చి చెబుతున్నారు. అయినా.. తాము ఉన్న ఇంటి పట్టాల్ని ఇచ్చేస్తే సరిపోయేదానికి.. ఇప్పుడు మళ్లీ కొత్తగా భూమి ఎందుకు జగనన్నా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ వాదనకు జగన్ అండ్ కో ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.