ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిమ్మగడ్డపై పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. నిమ్మగడ్డపై విమర్శలతో ఆగని పెద్దిరెడ్డి…అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తోన్న నిమ్మగడ్డ, అధికారులపై పెద్దిరెడ్డి విమర్శలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను గుర్తు పెట్టుకుంటామని, తమ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్ లిస్టులో పెడతామని నిమ్మగడ్డ వార్నింగ్ ఇవ్వడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవమైన అభ్యర్థుల డిక్లరేషన్ ఇవ్వని అధికారులకు మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు గృహానికే పరిమితం చేసి, మీడియా ముందు మాట్లాడకుండా అడ్డుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాలపై స్పందించిన పెద్దిరెడ్డి…మంత్రి అయిన తనపై చర్యలు తీసుకోవడం ఏమిటని అన్నారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలపై పెద్దిరెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై పెద్దిరెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.