విశాఖ స్టీల్ ప్లాంట్ బేరం పెట్టమని ఆ సంస్థ చెప్పిందట

చరిత్రాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మకానికి పెట్టడంపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది త్యాగాలకు ప్రతీకగా నిలిచిన వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటీకరించడంపై ఆంధ్రులు మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్ర్రైవేటీకరణ నిర్ణయంపై ఇటు ప్రతిపక్షాలు అటు కార్మిక, ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  ఐరన్ గనులు లేవని, నష్టాల సాకుతో స్టీల్ ప్లాంట్‌ను మోడీ ప్రైవేట్ సంస్థలకు దారాధత్తం చేస్తున్నారని, ఏపి లో జిందాల్ వంటి ప్రైవేటు సంస్థలకు గనులు లీజుకిచ్చిన కేంద్రం వైజాగ్ స్టీల్స్ కు ఎందుకు ఇవ్వదని నిలదీస్తున్నాయి.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దాని ప్రైవేటీకరణకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నిర్ణయంపై ఏపీలో ఉవ్వెత్తున్న నిరసనలు ఎగసిపడుతుండడంతో ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై తాము నీతీ ఆయోగ్ సిఫారసుల ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని అనురాగ్ ఠాకూర్ చేతులు దులుపుకున్నారు.

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే విక్రయించాలని నీతీ ఆయోగ్ సూచించిందని ఠాకూర్ చెప్పారు. బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగలేదని, కేంద్ర బడ్జెట్‌ను జాతీయ దృక్పథంతో చూడాలని ఆయన సూచించారు. పోలవరం నిధులపై తమను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 3 సార్లు కలిశారని , ఒప్పందం ప్రకారమే పోలవరానికి ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తున్నామన్నారు.

ఠాకూర్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. నీతీ ఆయోగ్ చేసిన అన్ని సిఫారసులను కేంద్రం అమలుచేస్తే దేశం బాగుపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేశంలోని ప్రముఖ సంస్థలను తాకట్టు పెడుతోందని, భావి తరాలకు ప్రభుత్వ రంగ సంస్థల ఊసే తెలీకుండా చేస్తోందని ఆర్థిక నిపుణులు దుయ్యబడుతున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.