ఏపీలో జరిగిన మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గుండుగుత్తుగా తామే గెలుస్తామని.. అధికార పార్టీ వైసీపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా మంత్రులు, పార్టీ ఇతర నాయకులు ఏ వేదిక ఎక్కినా.. పార్టీ గెలిచి తీరుతుందంటూ.. ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అయితే.. ఇదంతా ఎందుకు? నిజంగానే 12 కార్పొరేషన్లలోనూ వైసీపీ పాగా వేయడం ఖాయమేనా? అదేవిధంగా 71 మునిసిపాలిటీల్లోనూ వైసీపీ జెండా ఎగురుతుందా? అనేది కీలక చర్చకు దారితీస్తోంది. విషయంలోకి వెళ్తే.. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది.
ఇక్కడ గెలుపు ఎవరనేది ఇప్పటికీ.. అధికార పార్టీలో తర్జన భర్జన పడుతూనే ఉంది. అయితే.. పైకి మా త్రం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పిస్తోంది. అంతా మేమే విజయం సాధిస్తామని.. నాయకులు చెబుతున్నా రు. అంతేకాదు.. నూటికి నూరు శాతం స్థానికంలో తమదే విజయమని మంత్రి బొత్ససత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. దీనిని పదికి తగ్గించి.. తాము ఖచ్చితంగా 90 శాతం స్థానాల్లో విజయం దక్కించుకుంటామని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తాము 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తామని ప్రకటించారు. అయితే.. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి.. పైకి మంత్రులు చేస్తున్న కామెంట్లకు సంబంధం లేదని అంటున్నారు పరిశీలకులు.
కేవలం అధికార పార్టీ నేతలు.. సెల్ఫ్ గోల్ రాజకీయాలు చేస్తున్నారని.. పేదల ఇళ్లు.. అమ్మ ఒడి, రేషన్ కార్డుల ఏరివేత.. ప్రస్తుతం తీసుకువచ్చిన ఇంటింటికీ రేషన్ వంటి కీలక పథకాలు.. చాలా మందికి అర్హులైనా అందలేదనే ఆవేదన ఉందని.. ఈ నేపథ్యంలో ఓటింగ్‌పై ప్రభావం పడిందని అంచనాలు ఉన్నాయి. అదేసమయంలో విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాల్లో క్లాస్ ఓటింగ్ పెరగడం కూడా గమనార్హం. అంతేకాదు.. మాస్ ఓటర్లలోనే వైఎస్ పట్ల అంతో ఇంతో అభిమానం ఇప్పుడు వారు ఓటింగుకు దూరంగా ఉండడం.
క్లాస్ ఓటర్లు ఓటింగ్ లో ఎక్కువగా పాల్గొనడం వంటి కారణాలతో వైసీపీకి ఫలితం రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. ప్రజల్లో జగన్ ఇమేజ్ తగ్గలేదనే భావనను బిల్డప్ చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఈ క్రమంలోనే అంతా గెలుపు తమదే.. అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతుండడం గమనార్హం.