మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తుల లెక్కలు ఒక్కొక్కటి బయటకు వచ్చి విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న ఆయన భార్య స్వర్ణలతకు ఎసైన్డ్ భూములు ఉన్నట్లుగా లెక్క తేలితే.. తాజాగా చిత్తూరు జిల్లాలో వారి కుటుంబానికి.. కుటుంబ సభ్యులకు ఉన్న భూముల లెక్కల వివరాలు బయటకు వచ్చాయి. ప్రభుత్వ అధికారిక పోర్టల్ మీ భూమిలో అందుబాటులోఉన్న వివరాల ప్రకారం ఈ లెక్కను తేల్చినట్లుగా చెబుతున్నారు. ఇవి కాకుండా వారికి చెందిన బినామీ భూముల లెక్కల్నిఫైనల్ చేయాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
ఇందుకోసం మరికొంత కసరత్తు అవసరమని చెబుతున్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల్ని పక్కన పెడితే.. ఆయన తమ్ముడు.. వారి కుటుంబ సభ్యులు.. ముఖ్య అనుచరులు.. బినామీల పేర్ల మీద ఉన్న భూముల లెక్క చూస్తే.. కళ్లు చెదిరిపోవాల్సిందేనని చెబుతున్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో జులై 21న జరిగిన ఫైళ్ల దగ్థం ఉదంతం తర్వాత నుంచి భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేరుతో ఉన్న భూముల వివరాల్ని అధికారులు సేకరిస్తున్నారు.
వెబ్ ల్యాండ్ రికార్డుల ప్రకారం చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఉన్న భూముల లెక్కను చూస్తే..
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద 41.35 ఎకరాలు
– పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు మీద 23.42 ఎకరాలు (పెద్దిరెడ్డి కుమారుడు కం ఎంపీ)
– పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద 171.23 ఎకరాలు (మాజీ మంత్రి పెద్దిరెడ్డి సతీమణి)
ఈ భూములన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి?
తాజాగా వెలుగు చూస్తున్న వందల ఎకరాల భూములు ఎక్కడ ఉన్నాయన్నది చూస్తే.. వీటిలో అత్యధికం పుంగనూరుమండలం రాగానిపల్లె.. మేలుపట్ల.. భీమగానిపల్లె.. చౌడేపల్లె మండలం దిగువపల్లె.. పులిచెర్ల మండలం మంగళంపేట.. వెంకటరాసరపల్లె.. తిరుపతి మండలం తిరుచానూరు తదితర గ్రామాల్లో భూములు ఉన్నట్లు చెబుతున్నారు.
చట్టం ఏం చెబుతోంది?
అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం చూస్తే.. ఒక కుటుంబానికి 54 ఎకరాల మెట్ట భూములు.. 27 ఎకరాల మాగాణిభూములు ఉండకూడదు. తాజాగా వెలుగు చూసిన వందలాది ఎకరాలు చూసినప్పుడు పెద్దిరెడ్డి కుటుంబానికి ఎలా సాధ్యమైందన్నది ప్రశ్న. మరో ట్విస్టు ఏమంటే.. ఆస్తుల లెక్కలు ఓవైపు తేలుతుంటే..మరోవైపు పెద్దిరెడ్డి.. ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు సమర్పించే ఎన్నికల అఫిడవిట్లలో ఈ వివరాలు ఏమీ లేవని చెబుతున్నారు. రానున్న రోజుల్లో వారికి ఈ భూముల వ్యవహారం పెను తలనొప్పిగా మారుతుందంటున్నారు.
రికార్డుల్లో గుర్తించిన పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఉన్న 236 ఎకరాలకు అదనంగా భూములు ఉన్నట్లు చెబుతున్నారు.
అక్రమంగా క్రమబద్ధీకరించిన 982.48 ఎకరాల్లో పెద్దిరెడ్డి.. ఆయన అనుచరుల వాటానే దాదాపు 600 ఎకరాలుగా చెబుతున్నారు. ఇందులో అత్యధికం గడిచిన ఐదేళ్లలోనే ఆయన వశమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పారిశ్రామివాడలోనూ పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలత పేరుతో 27.7 ఎకరాల ఎసైన్డ్ భూమి ఉంది. ఇందులో 7.6 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. 1990 నాటికే పెద్దిరెడ్డి ఫ్యామిలీ కోట్లకు పడగలెత్తి ఉన్నప్పుడు.. వారికి ఎసైన్డ్ భూముల్ని ఎలా కేటాయిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న వందలాది ఎకరాల వివరాలు బయటకు రావటం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. దీనిపై రానున్న రోజుల్లో ఏం జరుగుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.