జబర్దస్త్ రోజా తనకు తిరుగులేదని, చిత్తూరు జిల్లా నగిరినియోజకవర్గంలో ఇక, తనకు ఎదురు లేదని అనుకుంటున్న విషయం తెలిసిందే. వరుస విజయాలు, ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న గాలి ముద్దుకృష్ణమ మరణం.. ఆయన కుటుంబం రాజకీయ ఆపశోపాలు పడుతుండడం.. కలివిడి లేకపోవడం.. వంటి పరిణామాలు రోజాకు కలిసి వచ్చి.. తను చెప్పిందే వేదంగా ఆమె నియోజకవర్గంలో చక్రం తిప్పుతు న్నారు. అయితే, రోజాకు వ్యూహాత్మకంగా ఇదే జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డుపుల్లలు వేస్తున్నారని వైసీపీలో ఓ చర్చ సాగుతోంది. గతంలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించినా.. పెద్దిరెడ్డి దీనికి అడ్డుపడ్డారనే ప్రచారం ఉండడం గమనార్హం.
ఇక, ఇప్పుడు ఏకంగా రోజాకు నియోజకవర్గంలో చెక్ పెట్టేలా పెద్దిరెడ్డి తెరవెనుక వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన రోజా..కు నియోజకవర్గంలో ఓ వర్గంతో వివాదం ఉంది. అది కూడా పెద్దిరెడ్డికి సదరు వర్గం వంతపాడుతోందని ఆమె.. గుస్సాగా ఉన్నారు. ఎవరైనా పెద్దిరెడ్డి వర్గం అని తెలిస్తే.. వెంటనే వారిని దూరం పెడుతున్నారు రోజా. ఇలాంటి ఫ్యామిలీలో ఫస్ట్ ఉంది.. కేజే కుమార్ కుటుంబం. గతంలో ఓ సభలో నేరుగా రోజా, కుమార్ కుటుంబాలు తలపడ్డాయి. రోజా దంపతులకు సత్కార కార్యక్రమంలో.. తమకు ప్రాధాన్యం దక్కలేదని, తాము రోజా గెలుపు కోసం ఎంతో కృషి చేశామని కుమార్ దంపతులు ఆరోపించారు.
ఇక, అప్పటి నుంచి పూర్తిగా రోజాకు ఈ కుటుంబం దూరంగా ఉంటోంది. ఇక, ఇప్పుడు రోజాకు చెక్ పెట్టాలని భావించిన మంత్రి పెద్దిరెడ్డి.. కె.జె.కుమార్ భార్య శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇప్పించారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అంతేకాదు, శాంతి ఎంపిక వెనుక.. చాలా వ్యూహమే ఉందని, కుదిరితే వచ్చే ఎన్నికల్లో రోజాను తప్పించినా.. ఆశ్చర్యంలేదని ఇక్కడి వైసీపీ నాయకులు అంటున్నారు. పెద్దిరెడ్డిపై అసంతృప్తితో ఉన్న రోజా.. ఆయన వర్గంగా ఉన్న వారిని పక్కన పెట్టడం, పనులు చేయకపోవడం వంటివి కొన్నాళ్లుగా చర్చకు వస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఆమెకు చెక్ పెట్టాలని భావిస్తున్నారని.. అందుకే ఇలా నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. రోజా.. శాంతిని టార్గెట్ చేస్తున్నారే తప్ప.. పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడం లేదు. ఆయనను ఒక్కమాటైనా అనకపోవడం! మరి మున్ముందు ఈ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.