అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్సెస్ టిడిపి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. చీనీ తోటల పంట బీమా డబ్బులు పెద్దారెడ్డి కొట్టేశారని జేసీ షాకింగ్ ఆరోపణలు చేశారు. చీనీ మొక్కలు నాటిన ఏడాదికి 13.89 లక్షల పంట నష్టం పరిహారం పెద్దారెడ్డికి అందిందని జేసీ ఆరోపించారు. అంతేకాదు, ఆ చీనీ తోటలను పరిశీలించేందుకు ఈ రోజు వెళ్తానని, తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే తనను ఆపాలని సవాల్ విసిరారు.
ఈ క్రమంలోనే జేసీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవి తనకు జగన్ పెట్టిన భిక్ష అని, ఒకవేళ తాను ఎమ్మెల్యే పదవిలో లేకుంటే జేసీని ఇంట్లో నుంచి లాక్కొచ్చి చెప్పుతో కొట్టుకుంటూ తాడిపత్రి మొత్తం తిప్పేవాడినని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లనూరు, పుట్లూరు మండలాల్లో మగాడెవడైనా ఉంటే ప్రభాకర్ రెడ్డితో పాటు తన తోటలో అడుగుపెట్టాలని సవాల్ విసిరారు.
వ్యవసాయం అంటే ఏంటో తెలియని జేసీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అందరు రైతులకు వచ్చినట్టే తనకూ పంట బీమా వచ్చిందని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి వంటి పనికిమాలిన వెధవని తాను ఈ రాష్ట్రంలో చూడలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి, పెద్దారెడ్డి కామెంట్స్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.