ఏపీ అధికార పార్టీ వైసీపీలో మరో రగడ తెరమీదికి వచ్చింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కీలకమైన పెద్దాపురం నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులు తెరమీదికి వచ్చాయి. ఈ నియోజకవర్గంలో గెలుపు గుర్రం ఎక్కితీరాలనేది వైసీపీ వ్యూహం. కానీ, గత రెండు ఎన్నికల్లోనూ ఇది సాధ్యం కాలేదు. టీడీపీ నాయకుడు, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు. 2014లో విజయం సాధించిన ఆయన 2019లో వైసీపీ హవా.. ఉన్నప్పటికీ.. గెలుపు గుర్రం ఎక్కారు.
ఈ నేపథ్యంలో వచ్చే 2024 ఎన్నికల్లో తప్పకుండా ఈసీటును సొంతం చేసుకోవాలనేది వైసీపీ ముందుగానే పక్కా ప్రణాళిక రెడీ చేసుకుని ముందుకు సాగింది. ఈ క్రమంలోనే ఎప్పడో ఆరు మాసాల కిందటే ఇక్కడ ఇంచార్జ్‌ని నియమించింది. దావులూరి దొరబాబుకు ఇక్కడ టికెట్ ఇస్తున్నట్టుగా కూడా ప్రకటన చేసింది. అందరూ ఆయన మాట వినాలని కూడా పేర్కొంది. అంతేకాదు.. దావులూరిని గెలిపించే వారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని ఎప్పుడో తేల్చి చెప్పింది. దీంతో అప్పటి నుంచి దావులూరి దొరబాబు ఇక్కడ పర్యటనలు చేస్తూ.. పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
అయితే.. ఇన్నాళ్లుగా ఆయన వెంట ఉన్నవారు.. ఇప్పుడు ఒక్కసారిగా అసంతృప్తి వెళ్లగక్కారు. అసమ్మతి నేతలు వ్యతిరేక గళం ఎత్తారు. మార్చకపోతే మూకుమ్మడిగా పార్టీని వీడేందుకు సిద్ధమని వెల్లడించారు. నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబును మార్చాలంటూ వైసీపీ కీలక నేతలు ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. ఇన్చార్జిని మార్చకపోతే మూకుమ్మ డి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. దీంతో కీలక నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఇబ్బందిగా మారింది.
మరోవైపు.. ఇప్పటికే ఈ జిల్లాలో మూడు కీలక నియోజకవర్గాల్లోనూ మార్పుల ఉప్పెన పార్టీలో కొనసాగుతొంది. ప్రత్తిపాడు.. పిఠాపురం.. జగ్గంపేట నియోజకవర్గాల్లో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోమని అధిష్టానం ప్రకటించింది. దీంతో వైసీపీకి వ్యతిరేకంగా నాయకులు తమ తమ మార్గాల్లో చర్చలు చేస్తున్నట్టు సమాచారం. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.