ఒక విషయం నుంచి లౌక్యంగా తప్పించుకునేందుకు మరో విషయాన్ని ప్రొజెక్టు చేయడం అనేది రాజకీయాల్లో నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కూడా ఇదే చేస్తున్నారు. తిరుమల పర్యటనను చాలా తెలివిగా తప్పించుకున్నారు.. రద్దు చేసుకున్నారు. వాస్తవానికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందన్న విమర్శలు, నిర్ధారణలు వచ్చిన తర్వాత.. దాని నుంచి బయట పడేందుకు జగన్ శత విధాల ప్రయత్నం చేస్తున్నారు.
దీనిలో భాగంగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లే తిరుమలను అపవిత్రం చేస్తున్నా రని, శ్రీవారి హుందాతనాన్ని, గౌరవాన్ని కూడా భంగపరుస్తున్నారని ఎదురు దాడికి దిగారు. దీనికి ప్రతిగా తాను తిరుమలకు వెళ్లి.. శ్రీవారిని క్షమించమని వేడుకుంటానని జగన్ ప్రకటించారు. ఈ పర్యటనకు ముందు.. కాలినడక వెళ్తున్నారని వైసీపీ ప్రచారం చేసుకుంది.
ఇది తమకు కలిసి వస్తుందని అనుకున్నారో.. లేక మరో కారణమో తెలియదు కానీ.. పాదయాత్రగా జగన్ తిరుమలకు చేరుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా పర్యటనకు సమయం వచ్చే సరికి పాద యాత్రగా వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని నేరుగా వాహనంలోనే తిరుమలకు వెళ్తారని మరో ప్రకటన చేశారు. ఇక, ఇప్పుడు దీనిని కూడా పూర్తిగా రద్దు చేసుకున్నారు. అయితే.. దీనికి జగన్ స్వయంగా చెప్పిన కారణం.. శాంతి భద్రతలు! పైగా తనకు నోటీసు ఇచ్చారని కూడా!!
తాను తిరుమలకు వెళ్తే.. ఇబ్బందులు వస్తాయని, కార్యకర్తలు, నాయకులు హంగామా సృష్టిస్తారని కాబట్టి ప్రభుత్వం తనను రావద్దంటూ నోటీసులు ఇచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్‌గా సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. ఒకవేళ ఇచ్చి ఉంటే ఆ నోటీసులను మీడియా ముందు చూపించాలని కూడా అన్నారు. సీఎం వ్యాఖ్యలకు వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు.
ఈ పరిణామాలను గమనిస్తే.. జగన్ ఉద్దేశ పూర్వకంగానే తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని స్పష్టమవుతోంది. దీనికి ఆయన శాంతి భద్రతలను సాకుగా చూపుతున్నారని స్పష్టమవుతోంది. కిందపడ్డా పైచేయి నాదే అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్న తీరును సాధారణ ప్రజలు సైతం తప్పుబడుతున్నారు. తాను నిజంగానే వెళ్లాలని అనుకుంటే.. డిక్లరేషన్‌పై సంతకం చేసి వెళ్లొచ్చు. కానీ, ఇలా చేయడం జగన్‌కు ఇష్టం లేకనే.. దొడ్డిదారులు వెతుక్కున్నారన్నది ప్రధాన విమర్శ. ఏదేమైనా.. జగన్ తీసుకున్న `రద్దు` నిర్ణయం ఆయనకే బూమ`రాంగ్` అయింది.