ఏపీలో కొద్ది నెలలుగా ఏ రచ్చబండ దగ్గర చూసినా ఒకటే చర్చ….కొద్దో గొప్పో ఆర్థిక వ్యవస్థపై, అప్పులు, రాబడులపై అవగాహన ఉన్న వారి నోట ఒకటే మాట…అంతెందుకు నలుగురుండే ఓ కుటుంబాన్ని నడిపే ఓ కుటుంబ పెద్ద మస్తిష్కంలో మెదిలేది కూడా అదే ఆలోచన….ఆంధ్రా భవిష్యత్తు ఏమిటి? ఏపీలో భావి తరాల వారి పరిస్థితి ఏమిటి? జగన్ పాలన అంతమయ్యేనాటికి ఏపీలో ఒక్కో తలపై ఎంత అప్పు ఉంటుంది? ఏపీలో సామాన్యులు బ్రతికి బట్టకట్టే పరిస్థితి ఉంటుందా? జగనన్న పప్పు, బెల్లాల పంపకానికి అంతముందా? ప్రభుత్వ ఉద్యోగులు కూడా అమ్మో ఒకటో తారీకు అనే రోజులు పోయేదెప్పుడు? ఇటువంటి ప్రశ్నలపై మాత్రమే కొంతకాలంగా ఏపీలో చర్చ జరుగుతోందంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.
ప్రతిపక్ష నేతలను కూడా ఇవే ప్రశ్నలు తొలిచివేస్తున్నాయి. ఇపుడు జనం అడుగుతున్న ప్రశ్నలనే చాలాకాలం నుంచి ప్రతిపక్ష టీడీపీ నేతలు అడుగుతున్నారు. కానీ, ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం అని కొట్టిపడేసినవారంతా ఇపుడు పశ్చాత్తాపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంకెన్నాళ్లు పిట్టకథలు చెబుతారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పయ్యావుల డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఆదాయం, మూలధన వ్యయం ఎంతో స్పష్టంగా చెప్పాలని, పథకాలకు పెడుతున్న ఖర్చు కన్నా.. వాటి ప్రచారం ప్రకటనల కోసం పెడుతున్న ఖర్చులే ఎక్కువని పయ్యావుల ఎద్దేవా చేశారు. ఏపీలో కొత్త పెట్టుబడులేవీ రాలేదని, జగన్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు నెట్టారని విరుచుకుపడ్డారు. ఏపీలో మరో తరం కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని జగన్ దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. శాఖల వారీగా ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని పయ్యావుల సవాల్ విసిరారు. ఆదాయం బాగున్నప్పుడు పొరుగు రాష్ట్రాల్లాగా ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకూ అప్పులిచ్చే పరిస్థితి ఎందుకు లేదని పయ్యావుల నిలదీశారు.