బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ మీద ఈగ వాలినా అంగీకరించిన వస్తున్న విమర్శలను నిజంగానే నిజం చేసేలా ఉన్నారు. రాష్ట్రమంతటా నంద్యాల ముస్లిం కుటుంబం ఆత్మహత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తుంటే… ఒక్క సోము వీర్రాజు మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఆత్మహత్య చేసుకుంటే పోలీసులను అరెస్టు చేస్తారా ? చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని… సంచలన వ్యాఖ్యలు చేశారు.
చనిపోయిన వ్యక్తి వీడియో తీసి పోలీసుల వేధింపుల వల్లే చనిపోయాడని మరణవాంగ్మూలం ఇస్తే… డ్యూటీ చేసిన పోలీసులను అరెస్ట్ చేయడం ఏంటని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుచేసిన నిందితులను వదిలేసి ముస్లింలను సమీకరించి పెద్ద ఉద్యమం నడుపుతున్నారని వీర్రాజు… చంద్రబాబుపై విమర్శలు చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
అసలు బీజేపీని సోము వీర్రాజు పెంచాలనుకుంటున్నారా? తుంచాలనుకుంటున్నారా అని బీజేపీ నేతలే షాక్ కు గురవుతున్నారు. ఎందుకంటే సలాం హత్యలో అందరూ మానవీయతను చూస్తే కేవలం వీర్రాజు మాత్రమే మతాన్ని చూస్తున్నారు. పైగా పెట్టీ కేసు పెట్టి నిందితులకు బెయిలు రావడానికి కారణమైన వైసీపీ సర్కారును వదిలేసి ఎవరో లాయరు బెయిలిప్పిస్తే టీడీపీపై వీర్రాజు విమర్శలు ఏపీలో బీజేపీని నవ్వుల పాలుచేస్తున్నాయి.
ఈ కేసు నుంచి వైసీపీ సర్కారును, జగన్ ఇమేజిని కాపాడటానికి వీర్రాజు విశ్వప్రయత్నం చేశారు. దీనిపై ఈరోజు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. నంద్యాల ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం మృతిపై సోము వీర్రాజు వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని పయ్యావుల కేశవ్ తప్పుపట్టారు.
వేధింపులకు గురైన కుటుంబంలో మతాన్ని చూస్తారా? అంటూ వీర్రాజును ప్రశ్నించారు. బాధితుల రక్తపు మరకలపై రాజకీయ సౌధం నిర్మించాలనుకుంటున్న వీర్రాజును ప్రజలు ఎవరూ సమర్థించరు అని పయ్యావుల తప్పుపట్టారు. వీర్రాజు లాంటి వ్యాఖ్యలో చరిత్రలో ఏ రాజకీయ నేత చేయలేదని, ఇది వ్యక్తిగా దిగజారడమే అని సోము వీర్రాజుపై పయ్యావుల కేశవ్ ఆరోపించారు.