జనసేనాని పవన్ కల్యాణ్ జూన్ 14 నుంచి వారాహి విజయ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ పర్యటనకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే నిన్న నరసాపురంలో పవన్ యాత్రకు భారీ స్పందన వచ్చింది. ఆ తర్వాత పవన్ భీమవరానికి చేరుకున్నారు. అయితే, అనూహ్యంగా పవన్ నీరసానికి గురయ్యారు. దీంతో, ఈ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. రేపు యాత్ర కొనసాగిస్తారని అంతా అనుకుంటున్న తరుణంలో పవన్ జ్వరం బారిన పడ్డారు. దీంతో, వారాహి యాత్రకు రెండు రోజుల పాటు బ్రేక్ పడింది.
పవన్ కొద్ది రోజులుగా వారాహి నవరాత్రుల ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఉపవాసం వల్ల పవన్ నీరసించారు. జ్వరం కూడా నీరసానికి తోడవడంతో మరింత నీరసించారు. దీంతో, వారాహి యాత్రను తాత్కాలికంగా పవన్ కల్యాణ్ నిలిపివేశారు భీమవరంలోనే పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. భీమవరంలో పవన్ ఈ నెల 30న బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.
కాగా, వారాహి యాత్రపై సినీ నటుడు, ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధం హ్యూమన్ మైండ్ అని, దానిని వాడుకొని యువతతో పవన్ గేమ్ మొదలుపెట్టాడని ఆరోపించారు. కత్తులు, తుపాకుల కంటే ఇది డేంజర్ గేమ్ అని అన్నారు. ఆ గేమ్ ను కాపు యువతపై పవన్ ప్రయోగిస్తున్నారని పోసాని విమర్శించారు. పవన్ కొడతా అంటే.. మనం కొట్టాలి… పవన్ చంపేస్తా అన్నాడంటే… మనం చంపి రావాలి అనే రీతిలో కాపు యువతను పవన్ తయారు చేశాడని విమర్శించారు.