గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాలన రాజధాని విశాఖకే త్వరలో తాము షిఫ్ట్ అవుతామని, పాలన కొనసాగిస్తానని జగన్ అన్నారు. ఏపీలో 13లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, 340 ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ శుభాకాంక్షలు చెప్పారు.
అంతేకాదు, విశాఖలో సదస్సు సందర్భంగా మార్చి 3,4వ తేదీలలో ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయబోమని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రకృతి అందాలతో అలరారే విశాఖకు వస్తున్న పెట్టుబడిదారులందరికీ పవన్ జనసేన తరఫున స్వాగతం పలికారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, యువతకు ఉపాధి లభించాలని పవన్ ఆకాంక్షించారు. పారిశ్రామికవేత్తలు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని అన్నారు.
ఇక, ఏపీలో ఆర్థిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి అంశాలను పెట్టుబడిదారులకు పూర్తిగా వివరించాలని, అడ్డంకులు ఏమీ ఉండవని వారిలో నమ్మకాన్ని కలిగించాలని పవన్ కోరారు. ఈ సదస్సు ఉద్దేశాలను కేవలం విశాఖకు మాత్రమే పరిమితం చేయకూడదని, తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప వంటి ఇతర ప్రాంతాలకూ విస్తరించాలని పవన్ కోరారు.
అక్కడ కూడా అభివృద్ధికి ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించాలని, ఇది ఏపీ మొత్తానికి పెట్టుబడిదారుల సదస్సుగా ఉండాలని కోరారు. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన పూర్తి మద్దతిస్తుందని అన్నారు. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న అని పవన్ అన్నారు.