ఒక్కసారిగా విశాఖ నగరం హీటెక్కిపోతోంది. గతంలో ఇలాంటి రాజకీయపరమైన ఒత్తిడి నగరంపైన ఎప్పుడూ పడలేదేమో. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల ఆద్వర్యంలో ఒకేరోజు మూడు భిన్న కార్యక్రమాలు జరుగుతుండటమే ఈ ఒత్తిడికి కారణమవుతోంది. అధికారవికేంద్రీకరణ, మూడురాజధానులకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగసభ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రజావాణి పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్ లో కార్యక్రమం పెట్టుకున్నారు.
జనవాణితో పాటు పవన్ మూడురోజుల పాటు పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవబోతున్నారు. సరిగ్గా శనివారం నాడే తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని, పాదయాత్రకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, నిపుణులను టీడీపీ ఆహ్వానించింది. జనసేన పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని వదిలేస్తే వైసీపీ, టీడీపీలు నిర్వహిస్తున్న కార్యక్రమాల ఉద్దేశ్యం పరస్పర వ్యతిరేకమైనవి కావటం గమనార్హం.
జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీ, భారీ బహిరంగ సభ చాలా పెద్ద కార్యక్రమమే అయినా టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమం కూడా కీలకమైనదే. ఈ రెండు కార్యక్రమాలు కూడా జనాల మధ్య లేదా పార్టీ నేతలు, శ్రేణుల మధ్య ఉద్రిక్తతలను రేకెత్తించేవే అనటంలో సందేహం లేదు. రాష్ట్రవ్యాప్తంగా జనాల్లో అమరావతికి మద్దతుగా సెంటిమెంటును రగిల్చేందుకు అమరావతి జేఏసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు జేఏసీ ప్రయత్నిస్తోంది.
రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న ఇలాంటి భారీ కార్యక్రమాల వల్ల జనాల్లో సెంటిమెంట్ రగులుతుందా ? పార్టీలు తమ టార్గెట్లు రీచవుతాయా అన్నది పక్కన పెట్టేస్తే రాజకీయ వాతావరణం మాత్రం నూరుశాతం కలుషితమైపోవటం ఖాయం. పార్టీలు ఇంతగా ప్రాయాసపడుతున్నాయి కానీ అసలు జనాల మనసుల్లో ఏముందో ఎవరికీ తెలీదు. ఈ వివాదానికి ముగింపు పడాలంటే 2024 ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.