ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు తోటి భారతీయులందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్….ఎందరో మహానుభావులు త్యాగ ఫలితంగా ఈరోజు మనం భారతీయులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై పవన్ ఘాటు విమర్శలు చేశారు. తన పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి రాష్ట్రంలోని భావితరాల భవిష్యత్తు కోసం జనసేన ఆఫీసు నిర్మించానని పవన్ భావోద్వేగానికి గురయ్యారు.
తనకు ఏమన్నా అయితే తన పిల్లలు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో మూడు కోట్లు జమ చేశానని, కానీ, ఆ డబ్బుతో జనసేన కార్యాలయం నిర్మించానని పవన్ ఎమోషనల్ గా చెప్పారు. సమాజంలో కుల వివక్ష ఉందని అందరూ అంగీకరించాలని, కులాల మధ్య సమతుల్యత తెచ్చి అభివృద్ధి వైపు నడిపించడమే జనసేన ఆలోచనని అన్నారు. చట్టాలను గౌరవించి పాటిస్తానని, చట్టాలకు అతీతంగా కోడి కత్తులతో పొడిపించుకొని డ్రామాలు చేయనని జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు.
వారాహి వాహనాన్ని ఏపీలో అడుగుపెట్టనీయబోమంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై పవన్ మండిపడ్డారు. పూర్తిగా కమ్యూనిజం పూర్తిగా రైట్ వింగ్ ఆలోచనలు ప్రస్తుత ప్రపంచానికి సరిపడవని పవన్ అభిప్రాయపడ్డారు. అందుకే, ఆ రెండింటికి మధ్యస్తంగా ఉన్న విధానాన్ని తాను ఎంచుకున్నానని, దాని వెనక వ్యక్తిగత స్వార్థం అనేది లేదని అన్నారు. గతంలో కమ్యూనిస్టులతో ఆ తర్వాత బిజెపితో పవన్ కలుస్తాడు అన్న కామెంట్లకు పవన్ ఆ విధంగా స్పందించారు.
మీరు సెల్యూట్ కొట్టే ముఖ్యమంత్రికి మీ పైన మీ వ్యవస్థ పైన గౌరవం లేదంటూ పోలీసులనుద్దేశించి పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ఓ ఎస్సైని జైల్లో పెట్టి కొట్టిన ఘనత జగన్ ది అని, అటువంటి జగన్ చేతిలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు అనుకుంటున్నారని, కానీ వారి మెడలు వంచి ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చేస్తామని పవన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే, తనతో సహా ఎవరిని గుడ్డిగా ఆరాధించొద్దని అభిమానులకు పవన్ సూచించారు.