టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కబోతోంది? మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు ఎన్ని బెర్త్ లు దక్కుతాయి అన్న చర్చ జోరుగా సాగుతోంది. తాము ప్రభుత్వంలో ఉంటూనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటామని జనసేనాని పవన్ కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఇక, నిన్న ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో జనసేన భాగస్వామి కానుందన్న అర్థం వచ్చేలా పవన్ మాట్లాడిన నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్‌కు కీలక మంత్రిత్వ శాఖతో పాటు డిప్యూటీ సీఎం హోదాను ఇచ్చే అవకాశముందని జనసేన వర్గాలు ఆశిస్తున్నాయి. సీఎంను మినహాయిస్తే 25 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటుంది. 135 మంది టీడీపీ ఎమ్మెల్యేలున్న నేపథ్యంలో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి నలుగురు లేదా ఐదుగురు, బీజేపీ నుంచి ఒకరు లేదా ఇద్దరు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. జనసేన ఎమ్మెల్యేల్లో 10 మంది కాపు సామాజిక వర్గం నేతలు కావడంతో వారికి 2 నుంచి 3 మంత్రి పదవులు ఇవ్వచ్చని పుకార్లు వస్తున్నాయి. పవన్‌తో కలిపి 4 మంత్రి పదవులు ఇస్తే కాపులకు 2, బీసీ 1, ఎస్సీలకు ఒకటి దక్కే అవకాశం ఉంది.
బీసీ సామాజిక వర్గం నుంచి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కాపు సామాజిక వర్గం నుంచి పవన్, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, కందుల దుర్గేష్ లకు మంత్రివర్గంలో చోటు దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ కూర్పుపై రేపు రాత్రికి ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, నిన్న ఢిల్లీలో జాతీయ చానల్ ‘ఇండియా టుడే’తో మాట్లాడిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు పవన్ ఆసక్తిగా ఉన్నారని, పవన్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారని ఆ ఛానెల్ తెలిపింది. కేబినెట్ కూర్పుపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది.