జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన పలువురు పెద్దలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే నిన్న ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి మురళీ ధరన్ తో భేటీ అయిన పవన్ కల్యాణ్…నిన్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో భేటీ ఫలవంతంగా సాగిందని, ఈ భేటీ ఏపీ ప్రజల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని చెప్పారు. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయన్నారు.
ఈ క్రమంలోనే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు వీరి భేటీ సాగింది. రాష్ట్రంలో జగన్ పాలనలో రాజకీయ పరిస్థితులు, ఏపీ బీజేపీ చీఫ్ మార్పు తదితర పరిణామామాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో శాంతి భద్రతల పరిస్థితులపై కూడా వీరిద్దరూ చర్చ జరిపారట. నడ్డా దృష్టికి పవన్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ తో తన భేటీపై నడ్డా ట్వీట్ చేశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఆ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఢిల్లీ టూర్ లో పవన్ మరింత మంది బీజేపీ పెద్దలను కలిసే చాన్స్ ఉందని తెలుస్తోంది. జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేసే అంశం ఒక కొలిక్కి వచ్చే వరకు పవన్ ఢిల్లీలోనే ఉండబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు, ఏపీలో మరో రెండు మూడు నెలల్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ బీజేపీ పెద్దలను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.