జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్రలో రోజు రోజుకూ వైసీపీ ప్రభుత్వం మీద విమర్ళల దాడి పెంచుతున్నారు. రెండో దశ యాత్రలో తొలి రోజు ఆయన చేసిన ప్రసంగం.. అందులో కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ముఖ్యంగా జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి దారి తీశాయి. ఏపీలో మహిళల అక్రమ రవాణాకు పరోక్షంగా వలంటీర్ల వ్యవస్థ కారణమవుతోందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి.
కేంద్ర నిఘా వర్గాలు తనతో చెప్పారంటూ.. ఏపీలో 17 వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని.. వలంటీర్లు రాష్ట్రంలో ఇంటింటికీ తిరిగి సేకరించిన సమాచారం పరోక్షంగా మహిళల అక్రమ రవారాకు కారణం అని పవన్ సంచలన ఆరోపణ చేశాడు. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు.. వాళ్లలో ఎవరేం చేస్తున్నారు.. ఎవరు ఏ పార్టీ.. ఎవరి లోపాలంటి.. ఎవరి సంబంధాలేంటి.. ఇలా వలంటీర్లు సేకరించిన సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతికి చేరిందని.. తద్వారా ఒంటరి మహిళలు అవుతున్నారని.. అలాగే వైసీపే నేతలు కూడా మహిళల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారని పవన్ ఆరోపించాడు.
దీని గురించి మీడియాలో, సోషల్ మీడియాలో నిన్నట్నుంచి పెద్ద చర్చే నడుస్తోంది. ఇది చాలా పెద్ద ఆరోపణ కావడంతో వైసీపీ వాలంటీర్లు, సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అనేక మంది వైసీపీ మద్దతుదారులు.. పవన్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని, ఇంటలిజెన్స్ వర్గాలను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేశారు. పవన్ మీద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతే కాక వలంటీర్ల గొప్పదనాన్ని చాటే పోస్టులు పెట్టి.. ఇంత మంచి పనులు చేస్తున్న వారి మీద తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఒక హ్యాష్ ట్యాగ్‌ను కూడా పెద్ద స్థాయిలో ట్రెండ్ చేస్తున్నాయి వైసీపీ వర్గాలు.