వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును రాజకీ యాల్లోకి తెచ్చి తప్పు చేశామంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ ఉదయం పూట ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. సాయంత్రం వేళలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా కాకినాడలో నిర్వహించిన సభలో కురసాల కన్నబాబుపై పవన్ నిప్పులు చెరిగారు. కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చి తప్పు చేశామని అన్నారు. అంతేకాదు.. కన్నబాబు ఎదుగుదలకు అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. ‘‘కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు. కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారా చెప్పండి.. బీసీ సామాజికవర్గానికి చెందిన గౌడబిడ్డని చెరకు తోటలో నిర్దాక్షణ్యంగా కాల్చేస్తే బీసీ నాయకులు ఏం చేస్తున్నా రు?“ అని ప్రశ్నించారు.
“కాపులకు అన్యాయం జరుగుతుంటే తోట త్రిమూర్తులు, కన్నబాబు ఏం చేస్తున్నారు? ఏదైనా మాట్లాడితే కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కన్నబాబు బాధపడతాడు. మేమే రాజకీయాల్లోకి తీసుకొచ్చాం. మా దురదృష్టం.. తప్పుచేశాం’’ అని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు యువతను ఓట్ల కోసమే వాడుకుంటున్నార ని.. సమాజాన్ని, మనుషులను కులాలుగా విడదీస్తున్నారని.. వారి భవిష్యత్తును మర్చిపోతున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే కన్నబాబుపై విమర్శలు గుప్పించారు.
ఎవరీ కన్నబాబు..
కురసాల కన్నబాబు గతంలో చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యం ద్వారా.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. దీనికి ముందు ఆయన ఈనాడు రిపోర్టరుగా పనిచేశారు. వార్తలు బాగా రాయడంతో చిరంజీవికి చేరువయ్యారు. ఇలా.. పార్టీలో చేరి.. టికెట్ దక్కించుకున్నారు. ఆయన ఎదుగుదలకు చిరంజీవి దోహద పడ్డారు. తర్వాత టికెట్ ఇస్తే గెలిచిన 18 మందిలో అతనొకరు. అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ బాట పట్టారు. తర్వాత.. జగన్ వెంట నడిచి వైసీపీలో చేరారు.