జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర అప్రతిహతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా నర్సాపురంలో పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా నరసాపురం జనసేన నేతలతో మాట్లాడిన పవన్…. సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్ల వయసులోనే ఓ ఎస్ ఐ ని కొట్టిన రికార్డు జగన్ కు ఉందని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తన మిత్రులతో కలిసి ఆయుధాలతో వేటకు వెళ్తున్న జగన్ ను పోలీసులు పట్టుకున్నారని, అయితే తమను పట్టుకున్న ఎస్ఐ ని జగన్ స్టేషన్ లో వేసి కొట్టాడని పవన్ ఆరోపించారు. జగన్ స్ఫూర్తితోనే మంత్రుల కొడుకులు… ఎస్పీ, డీఎస్పీలను కొడుతున్నారని పవన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. అయితే, జనసేన నేతలు అలా చేయడం లేదని, జనసైనికులకు చట్టాలపై గౌరవం ఉందని పవన్ స్పష్టం చేశారు. కానీ, మన హక్కులకు భంగం కలగనంతవరకే అవతలి వ్యక్తుల హక్కులకు రక్షణ ఉండాలని పవన్ అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ప్రత్యేకంగా మహిళల నుంచి విపరీతమైన ఆదరణ వస్తూ ఉండటం సంతోషాన్ని కలిగించిందని పవన్ అన్నారు. బలమైన భావజాలంతో ఉన్న పార్టీని 10 ఏళ్లపాటు నడపడం ఆషామాషీ విషయం కాదని పవన్ చెప్పారు. జనసేన పట్ల ప్రజల్లో స్వచ్ఛమైన ప్రేమ ఉందని, అది డబ్బుతో కొనే ప్రేమ కాదని పవన్ స్పష్టం చేశారు. ప్రతిసారి తాను పర్యటించడం కష్టమైన పని అని, ఇతర నాయకులు కూడా బలంగా తయారు కావల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీకి ఒక్క స్థానం కూడా రాకూడదని పవన్ అన్నారు. అది కష్టమైనా దానికోసం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. జనసేనలో పెద్ద స్థాయి నేతలు లేరని అంటున్నారని, జగన్ పుట్టగానే సీఎం కాలేదని పవన్ గుర్తు చేశారు. జగన్ అనేక దారుణాలు చేశాడని, అల్లర్లకు పాల్పడ్డాడని ఉదాహరించారు. తాజాగా, పవన్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.