ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని కొద్ది రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. రేపు జరగనున్న ఎన్డీఏ కూటమి సమావేశానికి కూడా టీడీపీని మోడీ ఆహ్వానించలేదు. అయితే, జనసేన అధినేత పవన్ కు మాత్రం ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీతో పొత్తులపై కూడా ఈ భేటీలో చర్చిస్తానని పవన్ షాకింగ్ కామెంట్లు చేశారు.
బీజేపీ పెద్దలతో పొత్తుపై చర్చించే అవకాశం ఉందని జాతీయ మీడియాతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. అంతేకాదు, పొత్తులపై మాట్లాడే అవకాశం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని పవన్ చెప్పారు. 2014లో బీజేపీతో కలిసి పని చేశానని, 2019లో విడిగా పోటీ చేశానని పవన్ అన్నారు.ఎన్డీఏ మిత్ర పక్షాల భేటీకి తనను బీజేపీ సీనియర్ నేతలు ఆహ్వానించారని అన్నారు. ఎన్డీఏ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని చెప్పారు. పవన్ తాజా కామెంట్ల ప్రకారం ఏపీలో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు దాదాపుగా ఖాయమన్న టాక్ నడుస్తోంది.
అయితే, బీజేపీతో కలిసి జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీలు కలిస్తేనే వైసీపీని ఓడించడం సాధ్యమని అంటున్నారు. కనీసం, టీడీపీ..జనసేనలు కలిస్తే వైసీపీ వ్యతిరేక ఓటు చీలదని, ఆ రకంగా అయితేనే ఇరు పార్టీలకు లాభమని చెబుతున్నారు. క్యాడర్ లేని పవన్…ఏపీలో బలం లేని బీజేపీతో…బలమైన వైసీపీని ఎదుర్కోవడం సాధ్యం కాదని అంటున్నారు. టీడీపీ అండ ఉంటేనే జనసేన కూడా లాభపడుతుందని చెబుతున్నారు.