ఏపీలో మహిళల అదృశ్యంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్ల కిందట ఏపీలో మహిళల అదృశ్యం వెనుక వలంటీర్లు ఉన్నారంటూ.. కాకినాడలో నిర్వహించిన వారాహి సభలో ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కూడా.. దీనిని కొనసాగించారు. ఇక, ఈ అదృశ్యం వెనుక వలంటీర్ల పాత్ర ఉందని, ఖచ్చితంగా వారు ప్రమేయం కూడా ఉందని.. దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలకు చెందిన వారు తనకు సమాచారం ఇచ్చారని పవన్ ప్రకటించారు.
పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. పెద్ద ఎత్తున వలంటీర్లు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. అయినా.. ఈ వ్యాఖ్యలపై పవన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇదిలావుంటే, చానాళ్ల తర్వాత.. మరోసారి పవన్ ఇదే వ్యాఖ్యలు చేశారు. తాజాగాటీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. అనూహ్యంగా మరోసారి ఏపీలో మహిళల అదృశ్యం అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఒంటరి మహిళలు, వితంతువులే లక్ష్యంగా అదృశ్యాలు జరుగుతున్నట్టు చెప్పారు. అంతేకాదు.. ఇలా అదృశ్యం వెనుక వలంటీర్లు ఉన్నారన్న విషయాన్ని కూడా మరోసారి పవన్ ఉద్ఘాటించారు.
దీనికి సంబంధించి తన దగ్గర పక్కా డేటా కూడా ఉందని చెప్పారు. ఒంటరి మహిళలు అన్యాయాలకు గురవుతున్నారని చెప్పారు. వితంతు మహిళలను కూడా వేధిస్తున్నారని.. అదృశ్యం వెనుక అధికార పార్టీ నాయకులు కూడా ఉన్నారన్న సమాచారం తన వద్ద ఉందని పవన్ చెప్పారు. ఇక, గతంలో తాను నిర్వహించిన వారాహి యాత్రలో తనపై దాడులు జరిగాయని పవన్ వెల్లడించారు. అయినప్పటికీ సహనంతో తాను వ్యవహరించారని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దానిని తరిమి కొట్టడం కోసమే అందరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ వైసీపీ పాలన అంతానికి కృషి చేయాలని పవన్ జనసేన నాయకులకు పిలుపునిచ్చారు.
లోకేష్ చేసింది జగన్ చేసిన ఆషామాషీ పాదయాత్ర కాదని పవన్ అన్నారు. తనకు పాదయాత్ర చేసే అవకాశం దక్కలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని సాగనంపడానికి టీడీపీీ-జనసేన కూటమి ఏర్పడిందని, రాబోయే ఎన్నికల్లో ఈ కూటమి గెలుపు తథ్యమని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
ఇది యువగళం ముగింపు సభ అని, లోకేష్ ను ఎలివేట్ చేసేలా ఉండాలని పవన్ సభకు రానని చెప్పారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే, ఈ సభ జనసేన, టీడీపీ కూటమికి నాంది పలుకుతున్న తొలి సభ అని, అందుకే పవన్ అన్న ఈ సభకు కచ్చితంగా రావాల్సిందేనని లోకేష్ తనతో చెప్పారని వెల్లడించారు.