విశాఖలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కడుతున్న వెంచర్ కి వాస్తు దోషం ఉందని టైకూన్ జంక్షన్ ను మూసివేశారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ జంక్షన్ మూసివేతకు నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టిన జనసేన నేత నాదెండ్ల మనోహర్, జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నాదెండ్ల అరెస్టుపై జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన నేతలు, వీర మహిళలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే తానే విశాఖకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తానని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
ఒక ఎంపీ కోసం టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, ఆ జంక్షన్ మూసివేతకు నిరసనగా కార్యక్రమం చేపట్టిన నాదెండ్లను, జనసేన నేతలను అరెస్టు చేయడం ఏంటని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జంక్షన్ మూసివేతపై స్పందించాల్సిన మున్సిపల్ అధికారులు, పోలీసులు… దానికి బదులు జనసేన నేతలను అరెస్టు చేయడం ఏంటని నిలదీశారు. జనసేన నేతల అరెస్టు అప్రజాస్వామికమని, వారిని తక్షణమే విడుదల చేయకుంటే తానే విశాఖకు వస్తానని పవన్ హెచ్చరించారు. మరి పవన్ హెచ్చరికలను వైసీపీ ప్రభుత్వం, పోలీసులు ఖాతరు చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక, నాదెండ్ల, జనసేన నేతల అరెస్టును జనసేన నేత, సినీ నటుడు నాగబాబు కూడా ఖండించారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపడం తప్పా అని నాగబాబు ప్రశ్నించారు. జనసేన నేతలు హింసకు పాల్పడలేదని, దాడులు, దహనాలు చేయలేదని, అయినా అరెస్ట్ చేయడం ఏంటని పోలీసుల తీరును నాగబాబు తీవ్రంగా ఖండించారు.