జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎక్కడినుండి పోటీచేస్తారో తెలీదు. పోటీచేసే నియోజకవర్గాన్ని ఇపుడే ప్రకటిస్తే తన ఓటమికి జగన్మోహన్ రెడ్డి రు. 200 కోట్లు ఖర్చుచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా పవనే చెప్పారు. అయితే ఇందుకు విరుద్ధంగా తమపైన పోటీచేయాలని ఇద్దరు నేతలు పవన్ కు సవాళ్ళు విసురుతున్నారు. కాకినాడలో పోటీచేసి తనపైన గెలవాలని కాకినాడ సిట్టింగ్ వైసీపీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చాలెంజ్ చేశారు.
దానికి పవన్ నుండి ఎలాంటి సమాధానం లేదు. అయితే ఇంతలోనే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మాట్లాడుతు తనపైన పిఠాపురంలో పోటీచేసి గెలవాలని చాలెంజ్ విసరటం చాలా ఇంట్రస్టింగుగా మారింది. ద్వారంపూడి చాలెంజ్ చేశారంటే అర్ధముంది మరి ముద్రగడ ఎందుకు చాలెంజ్ చేసినట్లు ? ద్వారంపూడి అంటే కాకినాడ సిట్టింగ్ ఎంఎల్ఏ కాబట్టి వచ్చేఎన్నికల్లో జగన్ మళ్ళీ టికెట్ ఇస్తారని అనుకోవచ్చు. అందుకనే తనపైన పోటీచేసి గెలవాలని ద్వారంపూడి చాలెంజ్ విసిరారు.
మరి ముద్రగడ ఎంఎల్ఏ కాదు. పైగా ఏ పార్టీలోను లేరు. వైసీపీలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం మాత్రం జరుగుతోంది. ఈ విషయాన్ని ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. ముద్రగడ వైసీపీలో చేరాలి, పోటీచేసే నియోజకవర్గం ఖరారు కావాలి. అప్పుడు కదా పవన్ కు ముద్రగడ చాలెంజ్ విసరాల్సింది. అయితే అందుకు విరుద్ధంగా పిఠాపురంలో తనపై పోటీచేసి గెలవాలని ముద్రగడ చాలెంజ్ చేశారంటే అర్ధమేంటి ? వైసీపీలో చేరి పిఠాపురం నుండి పోటీచేసే విషయంలో ముద్రగడకు జగన్ టికెట్ కన్ఫర్మ్ చేశారా ? అందుకనే పవన్ను ముద్రగడ సవాలు చేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
నిజానికి ముద్రగ సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు. ఆయన సొంతగ్రామం కిర్లంపూడి ఉండేది ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే. గతంలో ముద్రగడ ప్రాతినిధ్యం వహించింది కూడా ప్రత్తిపాడు నుండే. పిఠాపురం నుండి కూడా పోటీచేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇదే సమయంలో పిఠాపురం నుండి పవన్ పోటీచేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అందుకనే ముద్రగడ సవాలు విసిరారా అనే అనుమానం కూడా పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.