టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాఖలైన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 19వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్ పై కూడా విచారణ అదే రోజు జరగనుంది. దీంతో, సెప్టెంబర్ 19 వరకు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే రేపు రాజమండ్రి జైల్లో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు.
ఈ ప్రకారం చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు జైలు అధికారుల నుంచి పవన్ కళ్యాణ్ అనుమతి తీసుకున్నారు. పవన్ రాక నేపథ్యంలో రాజమండ్రి జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రికి పవన్ వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర 144 సెక్షన్ కొనసాగుతోంది. పవన్ రాక నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రేపు, పవన్, చంద్రబాబుల మధ్య రాజకీయ భవిష్యత్ కార్యచరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆల్రెడీ చంద్రబాబు అరెస్టుకు సంఘీభావం ప్రకటించిన పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు ఉంటుంది అన్న పరోక్ష సంకేతాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పొత్తుల వ్యవహారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మంగళవారం నాడు చంద్రబాబును ఆయన సతీమణి నారా భువనేశ్వరి తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ములాఖత్ అయిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం చంద్రబాబుతో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా భేటీ అయ్యారు.