జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది ముస్లిం యువతులు పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. తమకు దుల్హన్ పథకం ద్వారా లక్ష రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని వారు పవన్ ముందు వాపోయారు. తమ ఖాతాలలో కేవలం రూపాయి మాత్రమే జమ చేసి చేతులు దులుపుకున్నారని, తమకు దుల్హన్ పథకం కింద లబ్ధి చేకూరలేదని వాపోయారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై పవన్ సెటైర్లు వేశారు.
పెళ్లి చేసుకున్నందుకు ఒక్క రూపాయి కానుకగా ఇచ్చిన జగన్ కు పవన్ థాంక్స్ చెప్పారు. ఎన్నికలకు ముందు లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ సీఎం అయిన తర్వాత మాట తప్పి ఒక్క రూపాయి ఇచ్చారని పవన్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కొంతమంది దివ్యాంగులు పవన్ తో మాట్లాడారు. దివ్యాంగులలో అపరిమితమైన ప్రతిభ దాగి ఉందని. వారిని హేళన చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పవన్ హెచ్చరించారు. దివ్యాంగుల వద్దకే అధికారులు వెళ్లేలా చూసుకుంటామని, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు.
వారి ప్రతిభకు తగ్గ ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి నుంచి దివ్యాంగులను బయటకు తీసుకొస్తామని, వారిని తమ ప్రభుత్వంలో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. దివ్యాంగులపై సమాజం చిన్నచూపు చూస్తుందని, ప్రభుత్వాలు కూడా వివక్ష చూపిస్తున్నాయని ఆరోపించారు. అంగవైకల్యం కంటికి కనిపిస్తున్నా సర్టిఫికెట్ ఇవ్వరని, పెన్షన్ ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ పెన్షన్ అందడం లేదని ఆరోపించారు.
జగన్ సీఎం అయిన తర్వాత దుల్హన్ పథకం, కల్యాణమస్తు పథకాలు అటకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో, తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2023 లో ఒకసారి, అంతకుముందు 2022లో ఒకసారి ఇలా రెండు విడతల్లో 12వేల మందికి మాత్రమే లబ్ధి కలిగింది. ఇక, వధువు తప్పనిసరిగా పదో తరగతి పాస్ కావాలని నిబంధనపెట్టారు. 2019-2022 మధ్యలో పెళ్లి చేసుకొని అప్లై చేసుకున్న వారికి డబ్బులు జమ కాలేదు.