అమరావతి : మాటల్ని మార్చి చెప్పే టాలెంట్ రాజకీయ నేతలకు మామూలే. ఇదేం కొత్త విషయం కాదు. కానీ.. తాము చేసే తప్పుడు పనుల్ని సైతం గొప్పగా చెప్పటం.. దాన్నివేలెత్తి చూపించినోళ్లను బండ బూతులు తిట్టేయటం లాంటి సరికొత్త రాజకీయ ఎత్తుగడలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ది గ్రేట్ ఆంధ్రప్రదేశ్ .
ఎవరెన్ని అనుకున్నా.. అసలేం జరిగినా .. పాలకుల కారణంగా దారుణ నష్టం వాటిల్లుతున్నా.. చూస్తూ ఉండటం..తమ టైం వచ్చినప్పుడు ఓటుతో సమాధానం చెప్పటం మాత్రమే చేస్తూ.. మిగిలిన సమయంలో మాత్రం మౌన ప్రేక్షకుడిగా ఉండటం ఆంధ్రోళ్లలో కనిపిస్తూ ఉంటుంది.
చైతన్యానికి ప్రతీకగా చెప్పుకునే ఏపీ ప్రజలు.. ఎందుకిలా ఉంటారు? వారికి జరిగే అన్యాయానికి.. వారి భవిష్యత్తుకు జరిగే నష్టాలను చూస్తూ.. మౌనంగా ఉండటం వారికి మాత్రమే సాధ్యమన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడీ మాటలు ఎందుకంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యనే. ఇంతకాలం ఏమైందో తెలీదు కానీ.. ఇప్పుడు మాత్రం మూడు రాజధానుల మీద అమితమైన ప్రేమను ఒలకబోసే వారిని ఉపేక్షించేది లేదన్నట్లుగా పీకే మాటలు స్పష్టం చేస్తున్నాయి.
నిజమే.. ఒక రాజధాని సరిపోదు.. ప్రాంతీయ సమతుల్యం కోసం మూడు రాజధానులు అన్నప్పుడు..జిల్లాల మధ్య మరింత సమతుల్యం కోసం ప్రతి జిల్లాను ఒక రాజధానిగా ఎందుకు మార్చకూడదు? అందులో తప్పేముంది? ఇరుగు పొరుగున ఉన్న అన్ని రాష్ట్రాలు ఒక రాజధానితో సరిపెట్టుకుంటే.. వారెవరికీ లేని తెలివి తమకు మాత్రమే సొంతమని భావించే మూడు రాజధానులు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న వేళ.. ప్రపంచంలో మరెవరూ చేయని విధంగా ముప్ఫై రాజధానులు పెడితే తప్పేంటి?
మూడు రాజధానులకు ఉన్న జస్టిఫికేషన్.. ముప్ఫై రాజధానులకు (ఏపీలో ఉన్నది 25 జిల్లాలే అనుకోండి) లేదంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనేస్తూ వాదించేటోళ్లకు జనసేన అధినేత పిలుపునిచ్చిన యునైడెట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రాకు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. రావటం కాస్త లేట్ కావొచ్చేమోకానీ.. రావటం మాత్రం పక్కా అన్న సినిమా డైలాగ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో పవన్ తాజా రియాక్షన్ ఉందని చెప్పాలి.
మూడు రాజధానుల మీద ఇంతకాలం మాట్లాడే వారంతా పవన్ ఇప్పుడు తెరమీదకు తెచ్చిన యునైడెట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రా వాదనకు ఓటు వేయాల్సింది. మూడు అయితే ఓకే కానీ.. ముప్ఫైకి మాత్రం నాట్ ఓకే అంటే మాత్రం తొండి అవుతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతినే కాదు.. మరో రెండు రాజధానులు కూడా అంటూ ఇంతకాలం రాగాలు తీసిన వారు.. ఇప్పుడు పవన్ మాటకు ఏమంటారు? ఎలాంటి బదులు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏమైనా.. మూడు రాజధానుల మీద పవన్ తాజా వ్యాఖ్య మాత్రం మాస్టర్ స్ట్రోక్ గా చెబుతున్నారు.
ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో సాగుతున్న పాదయాత్రను టార్గెట్ చేస్తూ వస్తున్న అధికార పక్షాన్నిఆత్మరక్షణలో పడేసేలా పవన్ తాజా వ్యాఖ్యలు మారాయన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. పవన్ లేవనెత్తిన యునైడెట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రా వాదనకు జగన్ అండ్ కో ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.