టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని వైసీపీ సభ్యులు నిండు అసెంబ్లీలో అవమానించిన ఘటన ఏపీలో పెనుదుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై టీడీపీనేతలతో పాటు విపక్ష నేతలు కూడా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ నేతల వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. కుటుంబ సభ్యులను కించపరడం తగదని, అసెంబ్లీలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు.
ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని, చంద్రబాబు కంట తడి పెట్టడం బాధాకరమని పవన్ అన్నారు. ఈ తరహా ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగిస్తాయని, బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడడం సబబు కాదని పవన్ అన్నారు. ఇటీవలి కాలంలో సభలు, సమావేశాలు, చర్చల్లో వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోందన్నారు.
ప్రజాప్రతినిధులు విమర్శలు చేయవచ్చని, కానీ, వ్యక్తిగత దూష ణలకు దిగడం సమంజసం కాదని అన్నారు. ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను అవమానించేలా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను నిర్హేతుకంగా ఖండిస్తున్నాని పవన్ అన్నారు. గతంలో జగన్ కుటుంబసభ్యులను కొందరు తక్కువ చేసి మాట్లాడినప్పుడు కూడా ఆ వ్యాఖ్యలను తాము ఖండించామని గుర్తు చేశారు.
రాజకీయాలలో ఎవ్వరూ ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయవద్దని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా తమ నోటి దురుసును తగ్గించుకుంటే మంచిదని పవన్ హితవు పలికారు. ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుందని పవన్ అన్నారు. దీంతో, వైసీపీ నేతలకు పవన్ గడ్డి పెట్టారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.